ద్రవ్యోల్బణం ...... దేశ ఆర్థిక వ్యవస్థలో ఇదో విచిత్రమైన పదం.. ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థం. దీని సూచీ ఎందుకు పెరుగుతుందో.. ఎందుకు తగ్గుతుందో.. దీనికీ, ధరల సూచీకీ ఉన్న సంబంధం ఏమిటో.. ద్రవ్యోల్బణం సూచీ పెరిగితే ధరలు పెరుగుతాయని, తగ్గితే తగ్గుతాయని చెప్తారు... కానీ, ఇప్పుడు మైనస్‌లోకి పడిపోయినా ధరలు తగ్గటం లేదు... పైగా చుక్కలనంటుతున్నాయి. ఇదంతా ఒక మాయ.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో సామాన్య ప్రజానీకానికి అంతుపట్టని వ్యవహారం..
అర్థ శాస్త్రంలో ఇన్‌ఫ్లేషన్ అంటే వివిధ వస్తువులు, సర్వీసులకు సంబంధించి సాధారణ స్థాయిలో ఉండే ధరలు అని అర్థం. దీన్నే ద్రవ్యోల్బణం అని మనం చెప్పుకుంటాం. దీన్ని ఒక నిర్ణీత కాలానికి లెక్కిస్తారు. అమెరికన్ సివిల్ వార్ సమయంలో ప్రైవేట్ బ్యాంక్ నోట్ కరెన్సీ ప్రింట్ అయింది. అప్పుడే మొట్టమొదటిసారిగా ఇన్‌ఫ్లేషన్ అన్న పదం ప్రత్యక్షంగా వాడుకలోకి వచ్చింది. కరెన్సీ డిప్రిసియేషన్‌ను సూచిస్తూ దీన్ని ఉపయోగించారు. మన కరెన్సీలోని ప్రతి రూపాయితో వస్తువులను కానీ, సర్వీసులను కానీ కొనుగోలు చేస్తాం. మనీకి ఉండే నిజమైన విలువ, ప్రజల కొనుగోలు శక్తి మన ఆర్థిక వ్యవస్థలో జమాఖర్చులను ప్రభావితం చేస్తాయి. ఒక విధంగా సాధారణ ద్రవ్యోల్బణం రేటు వినియోగ దారుల ధరల సూచి అని చెప్పవచ్చు. ఇన్‌ఫ్లేషన్ రేటు సందిగ్ధంగా ఉంటే దాని వల్ల ఆర్థిక వ్వయస్థపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. పెట్టుబడులకు ప్రోత్సాహం లభించదు. హై ఇన్‌ఫ్లేషన్ రేటు వస్తువుల కొరతకు కారణమవుతాయి. ఇది స్థూల జాతీయోత్పత్తిపైనా ప్రభావం చూపుతుంది. అందువల్లే ద్రవ్యోల్బణం అంటే అటు పాలకులకు, ఇటు పారిశ్రామిక వేత్తలకు అంత హడల్.. నిపుణులు చెప్తున్నట్లు ద్రవ్యోల్బణ సూచీ పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. దీనిపై ఎవరికీ ఎలాంటి ఆక్షేపణ లేదు. కానీ, అదే సూచీ పడిపోయినప్పుడు ధరలు కూడా పడిపోవాలి కదా? కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఇన్‌ఫ్లేషన్ రేటు 14 శాతం చేరుకున్నప్పుడు పాలకులకు చెమటలు పట్టాయి. అప్పుడు ధరలను చూస్తే కందిపప్పు 45 రూపాయలు, బియ్యం 25 రూపాయలు.. అన్ని వస్తువుల ధరలూ అమాంతంగా పెరిగిపోయాయి. ప్రజలు ఏదో భరించారు... సరే ద్రవ్యోల్బణం రేటు తగ్గినప్పుడు ఎలాగూ ధరలు తగ్గుతాయని అనుకున్నారు. ఆశపడ్డారు. కానీ పరిస్థితి తిరగబడింది. శాస్త్రీయతకు భిన్నంగా ద్రవ్యోల్బణం రేటు పూర్తిగా నెగెటివ్ జోన్‌లోకి పడిపోయింది. అలాంటప్పుడు ధరలు పూర్తిగా తగ్గాలి. కానీ, అలా జరగలేదు. ఇన్‌ఫ్లేషన్ రేటు ఎక్కువగా ఉన్నప్పటికంటే ఎక్కువగా రేట్లు పెరిగిపోయాయి. అప్పుడు ఆ ధరలను భరించిన ప్రజలు ఇప్పుడు భరించలేకపోతున్నారు. తట్టుకోలేకపోతున్నారు. ఏం చేయాలో తోచక అల్లల్లాడిపోతున్నారు. కందిపప్పు 70 రూపాయలైంది. బియ్యం37 రూపాయలైంది. చివరకు కూరగాయలూ కొనే పరిస్థితి కనుచూపు మేరలో కొనే పరిస్థితి కనిపించటం లేదు. వంద రూపాయల నోటుకు ఒక రూపాయికున్నంత విలువ కూడా లేకుండా పోయింది. అప్పుడు రూపాయి ఇరవై పైసలు ఉన్న కోడిగుడ్డు ధర ఇప్పుడు మూడు రూపాయలకు చేరుకుంది. ద్రవ్యోల్బణం లెక్కింపులోని డొల్ల తనాన్ని ఈ పరిణామం సూచిస్తున్నది. టోకు ధరల సూచీ ఆధారంగా దీన్ని లెక్కించటం వల్ల ఇన్‌ఫ్లేషన్ నెగెటివ్ జోన్‌లో పడిపోయిందని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో డిమాండ్ పడిపోవటం వల్ల ద్రవ్యోల్బణం మైనస్ అయిందని, మనం ఒక విధంగా డేంజర్ జోన్‌లోకి వెళ్లినట్లేనని మరికొందరు అంటున్నారు.ద్రవ్యోల్బణాన్ని తప్పుగా లెక్కిస్తున్న వాస్తవాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికి గుర్తించింది. ఈ సెప్టెంబర్ నుంచి ఇప్పటికన్నా మరింత మెరుగైన, వాస్తవాన్ని వాస్తవంగా ప్రతిబింబించే స్థాయిలో కొత్త ద్రవ్యోల్బణ సూచీని తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అయితే దీన్నికూడా టోకు ధరల ఆధారంగానే సూచిస్తామంటున్నారు. దీంతో దీని విశ్వసనీయతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవ ధరల ముఖచిత్రాన్ని నిష్కర్షగా ఆవిష్కరించే విధంగా ద్రవ్యోల్బణ సూచీ అవసరం. సూచీ మాటెలా ఉన్నా, మోత మోగిస్తున్న ధరలను ఆకాశం నుంచి కిందకు దింపటానికి ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్‌లో అర్జెంటుగా తీసుకునే చర్యలు ఏమిటన్నది ఇప్పటికి మాత్రం సస్పెన్సే....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి