6, జూన్ 2009, శనివారం

మళ్లీ తెరపైకి మహిళా బిల్లు ...ఇదో రాజకీయం

వంద రోజుల్లో మహిళాబిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేలా చూస్తామని రాష్టప్రతి ప్రసంగం ద్వారా యుపిఏ సర్కారు తాజాగా ప్రకటించింది. కనీసం ఈసారైనా బిల్లు ఆమోదం పొందుతుందా? బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు సమాజ్‌వాది అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఇప్పటికే ప్రకటించారు. బిల్లును ఆమోదిస్తే సభలోనే విషం తాగి చస్తానని యునైటెడ్‌ జనతాదళ్‌ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందటం సాధ్యమేనా? ఓవైపు 33.3శాతం బిల్లే ఇన్ని సార్లు మురిగిపోతుంటే, యుపిఏ సర్కారు మహిళల కోసం మరిన్ని హామీలనిచ్చింది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామన్నారు. . అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల సాధికారతకు ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమాలను మరింత సమన్వయంతో అమలు చేస్తారు. ఇందుకోసం జాతీయ మిషన్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్దేశాలు మంచిగనే ఉన్నాయి. కానీ ఇవి ఎంతవరకు అమలవుతాయి? అన్నదే అనుమానం...చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచన పాతదే అయినప్పటికీ, 1996 నాటికి కానీ అది ఒక బిల్లు రూపంలోకి రాలేదు. 1996లో తొలిసారి లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఉంది.తొలిసారి 1996 సెప్టెంబర్‌ 12న దేవెగౌడ సర్కారు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును తొలిసారి ప్రవేశపెట్టారు. అప్పుడు ఏకాభిప్రాయం కుదరలేదన్న కారణంతో బిల్లు ఆమోదం పొందలేదు. పెండింగ్‌లో పడిపోయింది. ఇక్కడ ఏకాభిప్రాయం కుదరకపోవటానికి ప్రధాన కారణం రాష్ట్రీయ జనతాదళ్‌, సమాజ్‌వాది పార్టీ వంటివి. జాతీయ పార్టీలు అంగీకరించినా, ఈ రెండు పార్టీలు ఒప్పుకోవటం లేదు... అప్పటి నుంచి ఇప్పటి దాకి మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఇప్పటికీ ఆమోదానికి నోచుకోలేదు. 1998లో అటల్‌ బిహారీ వాజపేయి సర్కారు రెండోసారి ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. (199884వ రాజ్యాంగ సవరణ బిల్లు) కానీ, పార్లమెంటు పూర్తి గడువు తీరకుండానే రద్దు కావటంతో బిల్లు మురిగిపోయింది. 1999లో మరోసారి మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. 1999 డిసెంబర్‌ 23న దిగువ సభలో బిల్లును ఎన్‌డిఏ సర్కారు ప్రవేశ పెట్టింది. రాజకీయ ఏకాభిప్రాయం అన్నది లేదన్న కారణంతో మరోసారి అది విఫలమైంది. 2008 మే ఆరో తేదీన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం వూ్యహాత్మకంగా రాజ్యసభలో తాజాగా రిజర్వేషన్‌బిల్లును ప్రవేశపెట్టింది. ఈ విషయంలో యుపిఏ సర్కారు చాలా తెలివిగా వ్యవహరించింది. ఒకవేళ 14వ లోక్‌సభ గడువు ముగిసినా, లేక రద్దయినా, బిల్లు మురిగిపోయే అవకాశం లేదు. ఎందుకంటే రాజ్యాంగంలోని 107(4) అధికరణం ప్రకారం విధాన మండలి, రాజ్యసభలో ఏదైనా ఒక బిల్లు పెండింగ్‌లో ఉండి, సదరు బిల్లు లోక్‌సభ పాస్‌ చేయకపోయినప్పటికీ అది డెడ్‌లెటర్‌గా మురిగిపోయినట్లు కాదు... అందువల్లే 14వ లోక్‌సభ రద్దయిన తరువాత కూడా రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి అక్కడ బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లే లెక్క. మన దేశంలో పార్లమెంటు నిబంధనల ప్రకారం రాజ్యాంగ సవరణలు ఏవి చేసినా పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల ద్వారా నిశితంగా పరిశీలించి, స్క్రూటినీ చేసి మరీ చేయాల్సి ఉంటుంది. విషయాన్ని బట్టి అవసరమైతే రాషా్టల్ర చట్టసభల సహకారం కూడా తీసుకోవాలి. దీని దృష్టా్య గత లోక్‌సభలో ఎంపి ఇఎం సుదర్శన నాచియప్పన్‌ నేతృత్వంలో పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇది ఇప్పటికే మూడు సార్లు గడువు పెంచుకుంది. ఇప్పుడు ఈ కమిటీ తన నివేదికను 15వ లోక్‌సభకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కమిటీ నివేదికను ఆధారం చేసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వందరోజుల్లో బిల్లు పాస్‌ చేస్తామని చెప్తున్నప్పటికీ, నిర్ణయం తీసుకోవటానికి ఈ ప్రభుత్వానికి ఎలాగూ అయిదేళు్ల గడువైతే ఉంది. బిల్లులో ప్రధానంగా ఉన్న విషయాలు ...రాష్ట్రాల శాసన సభల్లో, లోక్‌సభలో 33.3 శాతం కోటా రిజర్వేషన్లు కల్పిస్తారు. ఇప్పటికే ఉన్న 22.5 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోటాకు ఇది అదనం...ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్‌ కోటాలోనూ మూడో వంతు మహిళలకే కేటాయించాలని బిల్లు చెప్తోంది. అంటే ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్‌ కోటా 22.5 శాతం ఉంది. ఇందులో 7.5శాతం మళ్లీ మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. మొత్తం మీద చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లు 33.3+7.5=40.8 శాతం అవుతుందన్నమాట. బిల్లుకు అనుకూలంగా సాగుతున్న వాదాలు... బిల్లు ద్వారా పార్లమెంటులో స్త్రీ పురుషులకు సమానావకాశాలు కల్పించవచ్చు. తద్వారా మహిళా సాధికారత పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రాతినిథ్యం పెరగటం వల్ల వివక్ష, వేధింపులకు వ్యతిరేకంగా వారు పోరాడ గలుగుతారు...బిల్లును వ్యతిరేకిస్తున్న వారు అంటున్న మాటలు.. బిల్లు వల్ల అగ్రవర్ణ మహిళలకే లాభం కలుగుతుంది. అధిక ప్రయోజనం చేకూరుతుంది. తద్వారా పేద అణగారిన వర్గాల మహిళలు వివక్షకు గురవుతారు.లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వాదన...నేను, నాపార్టీ బిల్లును వ్యతిరేకించటం లేదు. అయితే మహిళలకు 33.3శాతం కోటా అవసరం లేదు. వారికి 10 నుంచి 15శాతం రిజర్వేషన్లు కల్పిస్తే చాలు...మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు ముస్లింలు, ఓబిసిలు, మైనారిటీలపై ఎందుకు వివక్ష చూపాలి?ములాయం సింగ్‌ యాదవ్‌ వాదన....మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందితే వారి 33.3శాతం, ఎస్సీ, ఎస్టీ కోటా 22.8 శాతంకలిపితే మొత్తం రిజర్వేషన్లు 55.8శాతం అవుతాయి. ఇలాంటి చర్య సమాజంలోని మిగతా వర్గాల వారి పట్ల వివక్ష చూపటమే అవుతుంది. లోక్‌సభలో ముస్లింలకు మాత్రం ఎందుకు రిజర్వేషన్‌ కల్పించకూడదు...? బిల్లుతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలే 10శాతం టిక్కెట్లను మహిళలకు స్వచ్చందంగా ఇవ్వాలి. అన్ని పార్టీలూ దీన్ని తప్పనిసరిగా పాటించాలి.15లోక్‌సభలో 59 మంది మహిళలు ఉన్నారు. అంటే దాదాపు 10.8శాతం మహిళలు లోక్‌సభలో ఉన్నారు. 13వ అంధ్రప్రదేశ్‌ శాసన సభలో 34 మంది మహిళలు ఉన్నారు. 294 సభ్యులున్న మన శాసనసభలో మహిళల శాతం 11.5శాతం. రాష్టప్రతిగా(ప్రతిభాదేవీ సింగ్‌ పాటిల్‌,) లోక్‌సభ స్పీకర్‌గా(మీరాకుమార్‌) ప్రస్తుతం మహిళలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.యుపిఎ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కూడా మహిళయే...(సోనియాగాంధీ)రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో తొలిసారి ఆరుగురు మహిళలు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నారు.(కొండా సురేఖ, సబితా ఇంద్రారెడ్డి, డికె అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గల్లా అరుణకుమారి) కేంద్ర కేబినెట్‌లో ప్రస్తుతం ఉన్న మహిళా మంత్రుల సంఖ్య 8. అంతకు ముందు కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన మీరాకుమార్‌ రాజీనామా చేసి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడున్న మంత్రులు పురంధేశ్వరి, పనబాక లక్ష్మి, కుమారి షెల్జా, అంబికాసోనీ, అగాథా సంగ్మా, మమతా బెనర్జీ, కృష్ణతీర్థ, ప్రణీత్‌ కౌర్‌....దేశంలో తృణమూల్‌ కాంగ్రెస్‌,(మమతాబెనర్జీ) బహుజన్‌ సమాజ్‌ పార్టీ,(మాయావతి) ఆలిండియా అన్నాడిఎంకె,(జయలలిత) పీపుల్‌‌స డెమొక్రాటిక్‌ పార్టీ(మహబూబా ముఫ్తీ), భారతీయ జనశక్తి పార్టీ(ఉమాభారతి) లకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. ఇదీ దేశంలో మహిళా రాజకీయ శక్తి... ఇందరు సబలలు ఉండగా రిజర్వేషన్లు పదమూడేళు్లగా సాగిలపడటానికి కారణం ఏమిటి?

1 కామెంట్‌:

vinod చెప్పారు...

కారణమేముందీ ,రిజర్వేషన్ లని కూడా వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ లాగ పొందాలనుకొవడం.