23, జూన్ 2009, మంగళవారం

సంధ్యా సమీరం....

ఒక అబద్ధాన్ని నిజం అన్ని నమ్మించటానికి పెద్దగా శ్రమించనక్కర లేదు.. ఆ అబద్ధాన్ని పదే పదే చెప్తే చాలు... అదే నిజమై పోతుంది. నియంత హిట్లర్‌ దగ్గర పనిచేసిన గోబెల్‌‌స ఇందుకు ఆద్యుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విషయంలో తేడా రాలేదు.. న్యాయానికి న్యాయం చేయటం కంటే... అన్యాయాన్ని న్యాయంగా నమ్మించటానికి పెద్దగా శ్రమించనక్కరలేదు. చట్టం చుట్టపు చూపు చూస్తుంటే.. న్యాయం కళు్ల మూసుకుని పోతే.. సత్యం సంకెళ్లతో బందీ అయి విలవిల్లాడిపోతుంది.
నివురు గప్పి ఉన్నంత వరకే నిప్పు గుంభనంగా ఉంటుంది. ఒక్కసారి గాలి తాకిడికి నివురు తొలగిపోయిందంటే... నిప్పు కణిక మహాజ్వాల అయి భస్మరాశుల్ని మిగులుస్తుంది. సత్యం నిప్పులాంటిది. సత్యాన్ని వెలుగులోకి రాకుండా బంధించి ఉన్నంత వరకు దుర్మార్గులు, నేరం చేసిన వారు పబ్బం గడుపుకుంటారు... నిజం వెలుగుచూస్తే.. న్యాయం కళు్ల తెరుస్తుంది. నేరం ఆమడదూరం పరిగెడుతుంది. కానీ, ఆ నిజం వెలుగు చూసేదెలా? న్యాయం జరిగేదెలా? అప్పు తీసుకున్న పాపానికి ప్రేమ నటించిన ప్రియుడి కారణంగా చరిత్రాత్మక చార్మినార్‌ నుంచి కింద పడి మరణించిన సమీర విషయంలో ఇవే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి...... కానీ జవాబు చెప్పే వారే లేరు...
నాలుగు వందల ఏళ్ల భాగ్యనగరానికి నిలువెత్తు సంతకం చార్మినార్‌.. ప్లేగు వ్యాధి బాధితుల స్మృతి చిహ్నంగా నిజాం నవాబునిర్మించిన ఈ అద్భుత కట్టడాన్ని సందర్శించేందుకు రోజూ వందలాది మంది వస్తుంటారు. అందునా ప్రేమికులకు ఇది ఓ చక్కని విహార ప్రదేశం.. ఆ రోజు కూడా చార్మినార్‌ ఎప్పటిలాగే సందడిగా ఉంది. చార్మినార్‌ చుట్టూ చిన్న చిన్న వ్యాపారస్థులు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ కట్టడాన్ని సందర్శించేవాళు్ల.. చూసి తిరిగి వచ్చేవాళ్లతో హడావుడిగా ఉంది. సంధ్యా సమయం అప్పుడే మొదలవుతోంది. సూర్యుడు అస్తమించేందుకు పశ్చిమం దిశగా కదులుతున్నాడు.. ఇంతలోనే పెద్ద అరుపు.. ఆ వెంటనే పెద్ద శబ్దం.. చార్మినార్‌ తొలి అంతస్థునుంచి ఓ యువతి కిందకు పడిపోయింది. నెత్తుటి మడుగులో కొట్టుకుంటోంది. అక్కడ ఉన్న వాళు్ల ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు... ఆందోళనతో పరిగెత్తుకొచ్చారు.. ప్రాణాలతో ఉన్న ఆ యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు..
ఆ యువతి పేరు సమీర... పాతబస్తీలోని డబిర్‌ పుర ప్రాంతంలోని ఓ పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. సమీరమంటే గాలి.. ఆసుపత్రిలో 24 గంటలు మృత్యువుతో పోరాడి అలసిన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
ఇంతకీ చార్మినార్‌ నుంచి ఆమె ఎందుకు పడిపోయింది? ప్రమాదం అని కొందరు అన్నారు. కానీ, ఆమె ప్రియుడే ఆమెను చార్మినార్‌ తొలి అంతస్తు నుంచి కిందకు తోసి వేసాడు. చేతిలో చెయ్యి వేసి బాసలు చేసిన సఖుడే తన చెలిని చార్మినార్‌ సాక్షిగా చంపేశాడు...
అర్షద్‌ సమీరా ప్రియుడు ఉరఫ్‌ హంతకుడు.. నిజంగా ఆమెను ప్రేమ పేరుతో మోసం చేసే హతమార్చాడా? లేక దీని వెనుక మరో కారణం ఏమైనా ఉందా? లోతుల్లోకి విచారణ చేస్తే ఈ వ్యవహారంలో ఎవరి దృష్టీ పడని ఓ కొత్తకోణం ఆవిష్కారమైంది. దశాబ్దాలుగా పాత బస్తీ వాసుల్ని పీల్చి పిప్పి చేస్తున్న వడ్టీ వ్యాపారం ఈ కిరాతకానికి కారణమయింది......
సమీర తల్లిదండ్రులు అర్షద్‌ దగ్గర 14 వేల రూపాయల అప్పు తీసుకున్నారు...సకాలంలో దాన్ని తీర్చలేని పర్యవసానం సమీర హత్య.
అసలేం జరిగింది. వడ్డీ వ్యాపారానికి సమీర హత్యకు లింకేమిటి? ఇందులో ప్రేమ ప్రస్తావన ఎందుకు వచ్చింది. ఈ వ్యవహారంలో పోలీసులు తేల్చింది ఏమిటి? కూతుర్ని పోగొట్టుకున్న సమీర తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందా? ...............
సమీర హత్యతో ఉలిక్కి పడిన పోలీసులు రంగంలోకి దిగి హంతకుడిని సునాయాసంగానే పట్టుకున్నారు. అర్షద్‌ను కొన్ని గంటల పాటు విచారించిన తరువాత మీడియా ముందుకు తీసుకువచ్చారు. అసలు సమీర హత్యకు అప్పు కారణం కానే కాదని పోలీసులు తేల్చేసరికి అవాక్కయ్యే పరిస్థితి విలేఖరులకు ఏర్పడింది. ఆమె ఇతరులతో సన్నిహితంగా తిరగడం చూసి సహించలేకే అర్షద్‌ అంతమొందించాడని చెప్పారు.
నిందితుడు కూడా పోలీసులు చెప్పమన్న మాటల్ని పొల్లు పోకుండా చెప్పుకొచ్చాడు. అసలు తనకు ఫైనాన్‌‌స వ్యాపారమే లేదని కూడా అర్షద్‌ కుండబద్దలు కొట్టాడు. సంఘటన ఎందుకు జరిగిందో పోలీసులు చెప్పారు. నిందితుడూ అదే పాట పాడారు. మరి పాత బస్తీ వాస్తులు, సమీర తల్లిదండ్రులు చెప్పున్నవన్నీ అబద్ధాలేనా? అసలేది నిజం?
అర్షద్‌ దగ్గర తీసుకున్న అప్పు చెల్లించేందుకు సమీర అప్పుడప్పుడూ అర్షద్‌ ఇంటికి వెళు్తండేది. క్రమంగా ఆమెపై మోజు పెంచుకున్న అర్షద్‌ ఆమె ఆర్థిక బలహీనతను సొము్మ చేసుకున్నాడు. కుటుంబం కోసం ఆమె అర్షద్‌కు లొంగిపోయింది. హత్యకు ముందు రెండు రోజులు సమీర అర్షద్‌ను కలవలేదు.. దీంతో ఆమె ఇంటికి వెళ్లి వాకబు చేశాడు. తరువాత 2009 జూన్‌ 11న సమీర చార్మినార్‌ దగ్గర అర్షద్‌ను కలిసింది. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కోపంతో సమీరను చార్మినార్‌ నుంచి కిందకు పడదోశాడు. కేవలం వడ్డీ వ్యాపారమే సమీరను బలి తీసుకుందన్నది నిర్వివాదం.. తనకు ఫైనాన్‌‌స వ్యాపారం లేదని అర్షద్‌ చెప్పి ఉండవచ్చు. కానీ, అతను వ్యాపారం చేశాడు. ఫైనాన్‌‌స బుక్కులు కూడా నిర్వహించాడు. మరి పోలీసులు ఈ వ్యవహారంలో వడ్డీ వ్యాపారం అన్న సంగతిని ఎందుకు వదిలిపెట్టారు?... దాని ప్రస్తావన ఎందుకు చేయటం లేదు?.. అసలు ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయటం లేదు....? దీనికి కారణం లేకపోలేదు.. పాతబస్తీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న చాలా మంది వడ్డీవ్యాపారం చేస్తున్న వారే. 10 నుంచి 20 రూపాయల వరకు వడ్డీ ఇస్తున్న వ్యాపారులూ ఉన్నారు. వీరికి ఉన్న రాజకీయ పలుకుబడి సైతం సామాన్యమైందేమీ కాదు.. అర్షద్‌కు కూడా పలుకుబడి బాగానే ఉంది. ఈ విషయం పోలీసులపై ప్రభావం చూపించిందా? అందుకే నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారా? కేసు దర్యాప్తులో నిష్కర్షగా ఉండకపోతే.. సమీర లాంటి కేసులు ఏమీ తేలకుండానే, న్యాయం జరక్కుండానే గాల్లో కలిసిపోతాయి.

కామెంట్‌లు లేవు: