16, జూన్ 2009, మంగళవారం

చేసుకున్న వారికి చేసుకున్నంత....

తెలంగాణకు సోల్‌ గుత్తేదార్లమనుకుంటున్న వాళ్ల లొల్లి ముదిరి పాకాన పడింది. సమ్మతి, అసమ్మతుల మధ్య గొడవ తాడో పేడో తేల్చుకునేదాకా వెళ్లింది. తమ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం కెసిఆర్‌ను తెలంగాణ భవన్‌ నుంచి వెళ్ల గొట్టేదాకా లొల్లి ఆపే ప్రసక్తే లేదన్న స్థాయిలో తిరుగుబాటు దారులు విజృంభించారు. రోజు రోజుకూ ఆయన వెన్నంటి ఉన్నవారి సంఖ్య తగ్గిపోతోంది. సంక్షోభం నుంచి బయటపడే దారి తెలియక చంద్రశేఖర్‌ రావు తల పట్టుకుంటున్నారు. చివరకు కెసిఆర్‌ తన కారును ఎలా ముందుకు తీసుకువెళ్తారన్నది అంతుచిక్కటం లేదు.
చివరకు గులాబీ పువ్వును దాని ముళ్లే గుచ్చి గుచ్చి విధ్వంసం చేస్తున్నాయి. ముళ్ల దాడిని ఎలా అడ్డుకోవాలో తోటమాలికి అర్థం కావటం లేదు. ఎనిమిదేళు్లగా నారుపోసి, నీరు పెట్టి పెంచి పోషించిన తెలంగాణ గులాబీ మొక్కలో ఒక్కో పువ్వే రాలిపోతుంటే తోటమాలి మాత్రం ఏమీ చేయలేక చేవచచ్చి నిర్లిప్తంగా చూస్తూ కూర్చున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఇది దర్పణం. ఒంటెత్తు పోకడలతో అర్థం లేని నిర్ణయాలతో, అంతుపట్టని వైఖరితో, ఒక రాజకీయ పార్టీని వంకరటింకర దారిలో నడిపిన ఫలితాన్ని కె.చంద్రశేఖర్‌ రావు అనుభవిస్తున్నారు. నియంతృత్వ పోకడలు ఎవరికీ విజయాన్ని తెచ్చిపెట్టవని కెసిఆర్‌ విషయంలో మరోసారి రుజువయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాల్ని చవిచూసినప్పటి నుంచి అసమ్మతివాదులు ఒక్కరొక్కరుగా గళం విప్పుతున్నారు. కెసిఆర్‌ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ దిలీప్‌తో లొల్లి మొదలైనా గుంభనంగానే సాగింది. కొంతమంది అసమ్మతివాదులతో కలిసి తెలంగాణ విమోచన సమితిని ఆయన ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇంతలోనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ వూ్యహాత్మకంగా కెసిఆర్‌పై దాడి చేయటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కెసిఆర్‌ను గుక్కతిప్పుకోకుండా చేశాయి. పూర్తిగా రక్షణాత్మక పరిస్థితిలో పడేశాయి. ఎప్పుడూ ఎదురుదాడికి అలవడ్డ కెసిఆర్‌కు వైఎస్‌ఆర్‌ ప్రకటన తరువాత అసలు మాట్లాడే పరిస్థితే లేకుండా పోయింది. అప్పటిదాకా అజ్ఞాతంలో ఉన్న నేత అప్పటికప్పుడు బయటపడి మొక్కుబడిగా ఖండించారు.
వైఎస్‌ వ్యాఖ్యలు, కెసిఆర్‌ డిఫెన్‌‌స.. తిరుగుబాటుదారులు రెచ్చిపోయేందుకు దోహదపడ్డాయి. ఇంకేముంది..... యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఏ. చంద్రశేఖర్‌ రావు, ఉమాదేవి, సోమిరెడ్డి ఇలా ఒకరి తరువాత ఒకరు అధినేతను నిలదీశారు.. ప్రశ్నలు సంధించారు.. జవాబులడిగారు..
అసమ్మతివాదుల ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు? జవాబు చెప్పటం కంటే, సస్పెన్షన్‌ వేటు సులభం కాబట్టి కెసిఆర్‌ ఆ పని వెంటనే చేసేశారు..
కానీ, అసమ్మతి వాదులను సస్పెండ్‌ చేసి ప్రశ్నలను సమాధి చేశామనుకుంటే అది పొరపాటే.. తెలంగాణ ఉద్యమానికి ఇంతకాలం బలాన్ని, బలగాన్ని అందిస్తూ వచ్చిన తెలంగాణ ప్రజానీకాన్ని సమాధానపరచాల్సిన బాధ్యత కెసిఆర్‌పైనే ఉంది.
అసమ్మతి సెగ ఈరోజు తెలంగాణ భవన్‌ను తాకింది. మంటలు మరింత రేగకముందే దాన్ని ఆపటం, పార్టీ కేడర్‌లో మళ్లీ విశ్వాసాన్ని పెంచటం కెసిఆర్‌ బాధ్యత.

కామెంట్‌లు లేవు: