16, జూన్ 2009, మంగళవారం

ఈ పూట గడిస్తే చాలు..

గండం గడిచింది. అసమ్మతి సెగల్ని తగ్గించేందుకు రాష్ట్ర కార్యవర్గాన్ని హడావుడిగా సమావేశపరచి తనకు జై కొట్టించుకుని అప్పటికది ప్రస్తుతమన్నట్లుగా కెసిఆర్‌ ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ సమస్య వచ్చినప్పుడు చూసుకుందామనుకున్నట్లుగా కెసిఆర్‌ వ్యవహరించారు. కానీ, పార్టీలో అసమ్మతి గతంలో మాదిరిగానే చల్లబడుతుందా? అంటే అనుమానమే... ఇంతకు ముందు చెలరేగిన అసంతృప్తికి ఇప్పుడు జరుగుతున్న తిరుగుబాటుకు చాలా తేడా ఉంది. ప్రస్తుత వాతావరణం కెసిఆర్‌కు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టేలాగానే కనిపిస్తోంది.
నిత్య అసమ్మతి వాదం టిఆర్‌ఎస్‌ సొంతం.. అదేం ముహూర్తమో కానీ, టిఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటైన నాటి నుంచి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లే వారే తప్ప వచ్చే వారు లేరు. 2001 నుంచి ఇదే తంతు.. అసంతృప్తి రేగినప్పుడల్లా అంతుపట్టని విధంగా ఏదో ఒక హడావుడి చేయటం.. తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించిన తన నాయకత్వానికి ఓటేయించుకోవటం కెసిఆర్‌కు పరిపాటే... ఈ సారి కూడా అచ్చంగా అదే చేశారు. అసమ్మతి వాదులు డిమాండ్‌ చేసినట్లే... రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో పాల్గొనేందుకు వచ్చిన రవీంద్రనాయక్‌ను అన్ని మర్యాదలు చేసి వెళ్లగొట్టారు. తరువాత తీరిగ్గా కూర్చుని రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించుకున్నారు. బయట అంత హడావుడి అవుతుంటే కనీసం చిత్తశుద్ధితో సమీక్షించారా అంటే అదీ లేదు. నామమాత్రంగా వ్యవహారం నడిపించి కెసిఆర్‌ నాయకత్వానికి జైజై అనిపించుకుని, విధేయత ప్రకటింపచేసుకుని వెళ్లిపోయారు.
కెసిఆర్‌ ఎప్పడు చేసేలాగానే సమస్య అంతా సమసిపోయినట్లు పిక్చర్‌ ఇచ్చారు. ఇప్పటికి అంతా ముగిసినట్లే కనిపించవచ్చు. కానీ, కెసిఆర్‌కు నిజంగా గండం గడిచినట్లేనా? కెసిఆర్‌పై గతంలో వచ్చిన అసమ్మతి వేరు... అప్పటి రెబల్‌‌స వేరు. ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్న నాయకులంతా కెసిఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారే... ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఉన్నవారే.
* సీనియర్‌ నేత ఏ చంద్రశేఖర్‌ కెసిఆర్‌తో అత్యంత సన్నిహితంగా రాజకీయ జీవితంలో కలిసి ఉన్న నాయకుడు.
* ఇక తెలంగాణ విమోచన సమితి ఏర్పాటు చేసుకున్న దిలీప్‌ కెసిఆర్‌కు చాలా కాలం పిఎస్‌గా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్నారు.
* ఇక కెకె మహేందర్‌ రెడ్డి కెసిఆర్‌ ఇంట్లోనే ఎక్కువ కాలం గడిపిన వారు. ఆయన కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. టిఆర్‌ఎస్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నేత.
* రవీంద్ర నాయక్‌ గిరిజన నేతగా కెసిఆర్‌కు ఆప్తుడైన నాయకుడు. బంజారా గాంధీ అంటూ నాయక్‌ను అక్కున చేర్చుకున్న కెసిఆర్‌ చివరకు ఆయనకే చేయిచ్చారు.
* బెల్లయ్య నాయక్‌ మహబూబ్‌ నగర్‌లో కెసిఆర్‌ గెలుపునకు కారకుడైన నాయకుడు.
కెసిఆర్‌కు సంబంధించిన బలాలు బలహీనతలు అన్నీ తెలిసిన ఈ నాయకులే ఇవాళ తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్లే కాకుండా తెలంగాణా ధూంధాం నేత రసమయి బాలకిషన్‌, ఇతర మేధావులు కూడా కెసిఆర్‌కు దూరమయ్యారు. ఇప్పుడు ఆయన వెంట ఉన్నది, నడుస్తున్నది సిద్ధాంత కర్త కొత్తపల్లి జయశంకర్‌ మాత్రమే.
అందుకే గతంలో అసమ్మతి నాయకులను వెళ్లగొట్టినా, వారిపై తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేసినా కెసిఆర్‌ ఏది చెప్తే అది జరిగిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. వీళ్లను కెసిఆర్‌ ఎలా ఎదుర్కొంటారన్నది వేచి చూడాలి.
మరోపక్క అసమ్మతి వాదులైనా తమ వాదంపై గట్టిగా నిలబడగలరా అంటే అనుమానమే. ఒక ఉద్యమాన్ని కానీ, రాజకీయ పార్టీని కానీ ముందుకు నడపాలంటే ఆర్థిక, హార్థిక బలం అవసరం. దేవేందర్‌ గౌడ్‌ లాంటి పెద్ద నాయకుడే పార్టీని నడపలేక చిరంజీవితో విలీనం కావలసి వచ్చింది. ఈ విధమైన కారణాలే కెసిఆర్‌ నాయకత్వాన్ని కాపాడుతున్నాయి. అసమ్మతి నేతలు మీడియాలో హల్‌చల్‌ సృష్టించడం కంటే మించి ఏం చేయగలరన్నది జవాబు లేని ప్రశ్న. పైగా కెసిఆర్‌లో న్యాయపోరాటం చేస్తామని అసమ్మతి నాయకులు చెప్తున్నారు. దాని రూపం ఎలా ఉంటుందన్న దానిపై వారికి ఎలాంటి స్పష్టత లేదు. అంతే కాదు.. టిఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని పూర్తిగా మార్చాలంటున్న అసమ్మతివాదులు కెసిఆర్‌ లేకుండా ప్రత్యేక ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోగలమన్న విషయంపైనా క్లారిటీ ఉన్నట్లు కనిపించదు.... ఈనేపథ్యంలో అసమ్మతి వాదులు పోరాటం కొనసాగించగలరా? ఇంతకు ముందు నేతల్లా జారుకుంటారా అన్నది ఇప్పటికైతే సందేహమే...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి