19, జూన్ 2009, శుక్రవారం

రాజీనామా చేసిన కెసిఆర్‌

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు తన పదవికి రాజీనామా చేశారు. పార్టీలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న సంక్షోభం మునుపెన్నడూ లేని విధంగా కెసిఆర్‌ను టార్గెట్‌ చేసింది. పార్టీలో అసమ్మతి తనకు తీవ్ర మనస్తాపం కలుగజేసిందని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం సీనియర్‌ నేత రవీంద్ర నాయక్‌పై దాడి. నిన్నటికి నిన్న తెలంగాణ విమోచన సమితి ఆవిర్భావం.. అన్నీ కలగలిసి కెసిఆర్‌పై తీవ్ర ఒత్తిడి పెంచాయి. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్‌, కెసిఆర్‌పై తీవ్రస్థాయిలో సంధించిన విమర్శనాసా్తల్రు టిఆర్‌ఎస్‌ ముసలాన్ని ముదిరేలా చేశాయి. వైఎస్‌ వూ్యహాత్మకంగా వేసిన ఎత్తుగడ దాదాపుగా ఫలించిందనే చెప్పాలి. అయితే కెసిఆర్‌ గతంలో కూడా ఒకసారి రాజీనామా డ్రామా ఆడారు. ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత రాజీనామా లేఖను పంపించటం, రాష్ట్ర కార్యవర్గం దాన్ని నిరాకరించటం క్షణాల్లో జరిగిపోయిన పని. అప్పుడు పార్టీలో అసమ్మతి రేగకుండా కెసిఆర్‌ను ఆ రాజీనామా ఖేల్‌ కాపాడింది. కానీ, ఇప్పుడు పార్టీలో అసమ్మతి పతాక స్థాయికి చేరుకుంది. ఒకరి వెంట ఒకరుగా పార్టీని వీడిపోవటం, అదీ, కెసిఆర్‌ ఆనుపానులన్నీ తెలిసిన అత్యంత సన్నిహితులు, పార్టీ స్థాపన నుంచి వెన్నంటి ఉన్నవారు రాజీనామా బాటలో నడవటం కెసిఆర్‌కు తలనొప్పిగా పరిణమించింది. దీనికి తోడు కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు రావటంతో హరీశ్‌, రామారావులు తెరచాటుకు బలవంతంగా వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు కూడా రాజీనామా డ్రామా అవుతుందా? అన్నది 24 గంటలు వేచి చూస్తే కానీ అర్థం కాదు. రేపు రాష్ట్ర కార్యవర్గం సమావేశమై కెసిఆర్‌ రాజీనామా గురించి చర్చిస్తుంది. కానీ, ఇప్పటికే ఆయన వందిమాగధ బృందం ఆయన నాయకత్వాన్ని వేనోళ్ల కొనియాడుతూ ప్రకటనలు చేయటం ప్రారంభించింది. 1969 తరువాత తెలంగాణ భావోదేగానికి మళ్లీ ఊపిరులూదింది కెసిఆర్‌ అన్నది నిస్సందేహం. ఇందులో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు పార్టీని ముందుకు తీసుకుపోగలిగిన సమర్థుడైన నాయకుడు కెసిఆర్‌. దేవేందర్‌ గౌడ్‌ లాంటి నేతే సొంత కుంపటిని పెట్టుకుని పట్టుమని పది రోజులైనా ముందుకు నడపలేక చిరంజీవి పంచన చేరారు. కెసిఆర్‌ తన నియంతృత్వ ధోరణికి తెలంగాణ భావోద్వేగం తోడై పార్టీని ఇంతకాలం నిర్వహించగలిగారు. కానీ, ఆయన ఒంటెత్తు పోకడలు, తెలంగాణ రాష్ట్రం విషయంలో పలుమార్లు ఆయన వేసిన పిల్లి మొగ్గలు, వైఎస్‌తో సెల్‌‌ఫ కిల్లింగ్‌ గేమ్‌‌స ఆడటం చివరకు ఆయన అస్తిత్వాన్నే ప్రమాదంలో పడేశాయి. తాజాగా తెలంగాణ విమోచన సమితి ఏర్పాటు కావటంతో అసమ్మతికి తిరుగులేని బలం వచ్చినట్లయింది. దీనికి తోడు టిఆర్‌ఎస్‌ నుంచి మరో కీలక నేత కూడా బయటకు వెళ్లిపోతున్నారన్న వార్తలు మీడియాలో షికారు చేశాయి. రవీంద్రనాయక్‌ గొడవ టిఆర్‌ఎస్‌ కుము్మలాటలను తారాస్థాయికి చేర్చింది. చివరకు గిరిజనులకు కెసిఆర్‌ క్షమాపణ కూడా చెప్పుకున్నారు. కానీ పరిస్థితి చక్కబడలేదు సరికదా మరిన్ని చిక్కుముడులు పడింది. పర్యవసానం ప్రస్తుత కెసిఆర్‌ రాజీనామా. కెసిఆర్‌ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక ఇదీ ఒక డ్రామేనా తెలియదు. సీనియర్‌ నేతలు ఆయన్ను ఎంతవరకు ఒప్పించగలరు? కెసిఆర్‌ రాజీనామాను మిగతా నేతలు ఒప్పుకుంటే ప్రత్యామ్నాయం ఏమిటన్నది కూడా ఆలోచించాలి. కెసిఆర్‌ కాకపోతే పార్టీ అధ్యక్ష పదవి రేసులో ముందుగా ఉండేది హరీశ్‌రావు. ఆయన్ను కెసిఆర్‌ కుటుంబ సభ్యుడిగా లెక్కలోకి తీసుకుంటే విజయశాంతి ఆ పదవికి పోటీ పడతారు. లేక అందరికీ న్యూట్రల్‌గా ఉండేందుకు పార్టీ సిద్ధాంత కర్త జయశంకర్‌ను రంగం మీదకు తీసుకువచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు... ఎవరు అధ్యక్షులు అయినా తెరవెనుక రాజకీయం నడిపేది మాత్రం కెసిఆరేనని నిస్సందేహం...రాబ్రీ దేవిని సిఎం కుర్చీపై కూర్చోబెట్టి లాలూ ఏం చేశారో తెలియదా? అలాంటి రాజకీయమే ఇక్కడా నడుస్తుంది. తల పగుల గొట్టుకోవటానికి ఏ రాయి అయితేనేం. టిఆర్‌ఎస్‌లోని ఈ పరిణామాలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ నిలబెడతాయా? ముందుకు నడిపిస్తాయా? అంటే అనుమానమే... కెసిఆర్‌... జర సోచియే....

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి