
మెగాస్టార్... ఏడాది క్రితం వరకు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్త ఒక ఉత్కంఠను సృష్టించింది. ఆయన ఎన్నికల ప్రచారంలోకి కదిలితే జనం ఆయన వెంట పరిగెత్తింది. సరిగ్గా ఏడాది కాలం పూర్తయింది. ఇంకో ఇరవై ఆరు రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ తొలి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోబోతోంది. అదే సమయంలో అస్తిత్వం కోసం పోరాడుతోంది....ఉన్న వాళ్లంతా వెళ్లిపోతుంటే.. మిగతా వారిని కాపాడుకోవటానికి ఏం చేయాలో తోచక అయోమయంలో ఉంది.
పోయినోళు్ల పోతే పోనీ... ఉన్నోళ్లే చాలు... నా ఇమేజీ ఒక్కటే చాలు.. అన్నీ నేనే... అంతా నేనే.. నా సభలకు ప్రభంజనంలా వచ్చిన జనమే నేనేమిటో నిరూపిస్తున్నారు... ఇక అధికారంలోకి రావటమే తరువాయి....2009 ఎన్నికలకు ముందు చిరంజీవి చెప్పిన మాటలు.. నిజం.. ఇందులో ఎలాంటి అసత్యం లేదు. ఎన్నికలకు ముందు చిరంజీవికి ఉన్న అంచనాలు ఇవి. ఆయన తనను తాను అమితంగా విశ్వసించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. చిరు అంచనాలకు మీడియా హైప్ బాగా తోడయింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నికల దాకా ఆయన చేసిన ప్రచారానికి వచ్చిన జనం మరే రాజకీయ పార్టీ నాయకుడికీ రాలేదు.. మరి ఈ జనం అంతా ఏమయ్యారు. వీరంతా ఓట్ల రూపంలో ఎందుకు మారలేదు... తన సభలకు వస్తున్న వారు ఓట్లుగా మారటం లేదని ఎన్నికలు జరుగుతున్నప్పుడే చిరంజీవికి అర్థమయింది. కానీ, అప్పటికే జరగాల్సిన ఆలస్యమంతా అయిపోయింది. చివరకు 17శాతం ఓట్లతో, 18 సీట్లతో అసెంబ్లీలో మెగాస్టార్ అడుగుపెట్టారు. ఆ తరువాతైనా పార్టీని పటిష్ఠం చేసే దిశగా ప్రయత్నం చేశారా అంటే అదీ లేదు. దాని ఫలితం... పార్టీ క్రమంగా అనాధగా మారిపోతుండటం... రంగస్థలం మించి ఒక్కరొక్కరుగా తప్పుకుంటుండటం... కొందరు చిరంజీవిని నిందించి బయటకు వెళ్తే.. మరికొందరు ఇమడలేకపోతున్నామంటూ వెళ్లిపోయారు.. ఇంకొందరు సిద్ధంగా ఉన్నారు... మెగాస్టార్ రాజకీయ ప్రవేశంలో కీలక పాత్ర పోషించిన మిత్రా దగ్గర నుంచి ఒకే ఊరు.. కోస్టార్ అయిన కృష్ణంరాజు వరకూ అంతా చిరంజీవిని వదిలేశారు..
ఇలా ఎందుకు జరిగింది? ప్రజారాజ్యం పార్టీలో ఒకదాని వెంట ఒకటిగా జరుగుతున్న పరిణామాలకు కారణమేమిటి? పార్టీని ఇంతకాలం ముందుండి నడిపించిన మహామహులంతా ఏమైపోయారు..? ఎక్కడ ఉన్నారు..? ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవి ఇప్పుడు ఒంటరి అయిపోయారు.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన పార్టీ అస్తిత్వం ప్రశ్నార్థకంలో పడిపోయింది. పార్టీని వదిలిపెట్టి వెళ్లే వారే తప్ప.. వచ్చేవారు ఒక్కరూ కనిపించటం లేదు.. దీనికంతటికీ మూలం ఎక్కడ ఉందో.. అధినేత చిరంజీవికే అర్థం కాని పరిస్థితి ఉంటే.. ఇక మిగతా కేడర్‌కు ఎలా ఉంటుంది?
ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి మరో ఇరవై ఆరు రోజుల్లో ఏడాది పూర్తి చేసుకోబోతోంది. ఏడాదిలోనే ఎన్ని ఒడిదుడుకులు...పార్టీ ప్రారంభించినప్పుడు తిరుపతిలో జరిగిన బహిరంగ సభకు వచ్చిన ప్రజానీకాన్ని చూడగానే చిరంజీవితో పాటు ఆయన కోటరీలో విపరీతమైన ఆత్మవిశ్వాసం పెరిగింది. మెగాస్టార్‌ను అన్నీ తానే అయి నడిపించిన అల్లు అరవింద్ అయితే.. దూకుడుగా వ్యవహరించారు. వైఎస్, చంద్రబాబులు పోటీ చేసే రెండు స్థానాలు తప్ప 292 స్థానాలూ మావేనన్నారు.. అడుగడుగునా సర్వే చేసి గెలుపు గుర్రాలకే టిక్కెట్లిచ్చామన్నారు.. తీరా చూస్తే.. ఆయనే గెలవలేదు... ఆయన సొంత ఊళ్లో బావగారిని గెలిపించుకోలేదు.. పిఆర్‌పి ఎన్నికల వూ్యహం ఎంత పేలవంగా ఉందో అధినేత ఓటమితోనే తేలిపోయింది. సేఫ్‌గా రెండో స్థానంలో పోటీ చేసి గెలిచారు కాబట్టి చిరంజీవి ప్రతిష్ఠ ఆ మాత్రమైనా నిలబడింది. ఇక ఆ తరువాత అసలు కథ ప్రారంభమైంది.. ఒక్కరొక్కరూ నెమ్మది నెమ్మదిగా జారుకోవటం ప్రారంభించారు. ఎన్నికలకు ముందు కొందరు జారుకుంటే, ఫలితాల తరువాత మిగతా వాళు్ల ఆ బాట పట్టారు. మిత్రా, వినయ్, శివశంకర్, బండి రమేశ్, కనకారెడ్డి, కృష్ణంరాజు.. చివరకు రాష్ట్ర చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్లారు. ఇక కెఎస్‌ఆర్ మూర్తి, దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డి, నర్రా రవికుమార్‌లు తమకు ఇబ్బంది లేకుండా వెళ్లే దారిని వెతుక్కుంటున్నారు. మరో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను దేవేందర్ తనతో పాటు తీసుకెళు్తన్నారని వార్తలు.. ఇదే నిజమైతే... ప్రజారాజ్యం పతనం అంచుకు చేరుకున్నట్లే....
ఒక నిర్దిష్టమైన అజెండా ఏమీ లేకుండా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే.. దాని పరిస్థితి ఎలా ఉంటుందనేందుకు ప్రజారాజ్యం ఒక ఉదాహరణ...ప్రజారాజ్యం ఏర్పాటు హడావుడిగానే సాగింది. కానీ, దాని ప్రస్థానమే పడుతూ లేస్తూ సాగుతోంది. పార్టీ పెట్టిన సంవత్సర కాలంలో ఒకే ఒక్కసారి ఒక్క గంట పాటు కందిపప్పు ధరపై రోడ్డుపై కూర్చోవటం తప్ప చిరంజీవి నేరుగా ప్రజాందోళనల్లో ఏనాడూ పాల్గొనలేదు. పార్టీ పెట్టిన తరువాత కొంతకాలానికి సామాజిక న్యాయం సిద్ధాంతం మొగ్గ తొడిగింది. కనీసం పార్టీలోకి యువరక్తాన్ని తీసుకువచ్చారా అంటే అదీ లేదు. సీనియర్లయినా, రాజకీయ వూ్యహరచన చేయగల సమర్థులనైనా తీసుకున్నారా అంటే దానికీ జవాబు లేదు. ఇవాళ్టి రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపని వృద్ధబృందాన్ని పార్టీలోకి తీసుకువచ్చి, దాన్ని ఓ వృద్ధాశ్రమం చేశారు. వైఎస్, చంద్రబాబు లాంటి వాళ్లను ఎదుర్కొనే శక్తిసామర్థా్యలు వారికెక్కడివి? వాళ్ల సలహాలతో ముందుకు వెళ్లితే బోల్తా పడటం తప్ప సాధించేమేముంటుంది? చిరంజీవి విషయంలో అక్షరాలా జరిగింది ఇదే... దీనికి తోడు.. ప్రజారాజ్యం యూత్‌వింగ్ అధ్యక్షుడుగా కొరి పదవి తీసుకున్న తము్మడు పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత ఆ విభాగాన్ని గాలికొదిలేసి సినిమాల వెంట వెళ్లిపోయారు.. ఇక అల్లుఅరవింద్ జాడే లేకుండా పోయారు.. నాగబాబు సంగతి చెప్పేదేముంది.. వెరసి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో ఒంటరి అయిపోయారు... ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.