12, జులై 2009, ఆదివారం

కొత్త గుర్తింపు

రేషన్‌ కార్డు, పాన్‌ కార్డు, ఓటరు కార్డు, పాస్‌పోర్టు, సోషల్‌ సెక్యూరిటీ కార్డు.... మన రాష్ట్రంలో అయితే ఆరోగ్యశ్రీకార్డు కూడా ఉంది.. వీటన్నింటి బదులు ఇప్పుడు ఇంకో కార్డు వస్తోంది. దేశంలోని ప్రజలందరికీ ఓ ప్రత్యేక గుర్తింపు కార్డు రాబోతోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఏ ప్రయోజనమైనా పొందడానికి, దేశ పౌరుడిగా పూర్తి సంరక్షణ లభించటానికి ఉపకరించేలా ఓ కార్డును కేంద్ర ప్రభుత్వం 113 కోట్ల మంది భారతీయ ప్రజలకు అందించబోతోంది. అదే బయోమెట్రిక్‌ కార్డు...

బయో మెట్రిక్‌ గుర్తింపు కార్డు... ఇది దేశ ప్రజలందరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందించే కార్డు. దేశంలోని ప్రతి పౌరుడికి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని కల్పిస్తూ కార్డును ఇవ్వటానికి ఓ భారీ కార్యక్రమాన్నే కేంద్ర సర్కారు చేపట్టింది. ప్రజలకు బహుళ ప్రయోజనాలను కల్పించే లక్ష్యంతో అత్యంత పకడ్బందీగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కార్డు రూపొందుతోంది.
దేశంలో జరుగుతున్న అనేక అవకతవకలకు, అక్రమాలకు.. భయపెడ్తున్న ఆందోళనకు, అభద్రతకు అన్నింటికీ పరిష్కారంగా బయో మెట్రిక్‌ కార్డు రూపొందుతోంది. పది వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కార్డులను రూపొందిస్తున్నారు. ప్రతి పౌరుడికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డును ఇస్తారు. ఇది మిగతా కార్డుల మాదిరిగా కాకుండా సదరు పౌరుడికి మాత్రమే పరిమితమైన, ప్రత్యేకమైనదిగా తయారవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పౌరుల గుర్తింపు వ్యవస్థ ఇది. క్రెడిట్‌ కార్డు మాదిరిగానే ఓ స్మార్‌‌ట కార్డు బయోమెట్రిక్‌ పరిజ్ఞానంతో రూపొందుతుంది. ఇందులో వ్యక్తులకు సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. బయోమెట్రిక్‌ ఇమేజి అంటే మన వేలి ముద్రను అందులో రికార్డు చేసి ఉంచుతారు. దీంతో పాటు మన ఫోటో కూడా అందులో ఉంటుంది. ఐడి సిస్టమ్‌లో మనం ఎన్‌రోల్‌ అయినప్పుడే మన ఫోటోను కూడా హైక్వాలిటీలో రికార్డు చేస్తారు. పైగా ఇది చాలా చౌకగా కూడా తయారవుతుంది. బయో మెట్రిక్‌ టెక్నాలజీ ద్వారా రూపొందిన ఈ కార్డు వల్ల అందులోని సమాచారం చాలా భద్రంగా ఉంటుంది. వ్యక్తులు తమ సమాచారాన్ని అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. కార్డులో వేలిముద్రలు కూడా ఉండటం వల్ల సెక్యూరిటీ పెరుగుతుంది. అంతర్గత భద్రతపై విశ్వాసం పెరుగుతుంది. ఈ కార్డు ఇవ్వటం వల్ల ప్రత్యేకంగా పాన్‌ కార్డులు కానీ, రేషన్‌ కార్డులు కానీ, ఓటరు కార్డులు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అన్నింటీకీ కేంద్రీకృతమైన డేటాబేస్‌తో ఒకే కార్డుతో బహుళ ప్రయోజనాలను పౌరులకు కల్పించవచ్చు.

బయో మెట్రిక్‌ కార్డును పౌరులకు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ శాఖల సమన్వయంతో దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఇన్ఫోసిస్‌ మాజీ సిఇఓ నందన్‌ నీలేకనిని కేబినెట్‌ మంత్రి హోదాతో నియమించి ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది.
యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సంస్థను బయోమెట్రిక్‌ కార్డు రూపకల్పన కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇన్ఫోసిస్‌ మాజీ సిఇఓ నందన్‌ నీలేకని దీనికి అధిపతి. భారత్‌ భవిష్యత్తుపై సంపూర్ణ అవగాహన ఉన్న నీలేకని వంటి వ్యక్తికి ఈ ప్రాజెక్టును అప్పజెప్పటం అభినందనీయం.ఈ అథారిటీ ఇప్పటికే తన పనిని ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ మొన్న ప్రవేశపెట్టిన వంద కోట్ల రూపాయలు కేటాయించారు.

నీలేకని పని మొదలు పెట్టారు కానీ, దీన్ని సాధించటం అంత తేలికేమీ కాదు. మనది ఏ అమెరికా, బ్రిటన్‌ వంటి చిన్న చిన్న దేశమేం కాదు.. ఒక్కో రాష్ర్టం ఒక్కో బ్రిటన్‌ అంతగా ఉన్నంత పెద్ద దేశం. దాదాపు 113 కోట్ల మంది ప్రజానీకానికి ఈ కార్డులు అందించాల్సి ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించకుండా, సహకారం తీసుకోకుండా ఇంత భారీ యత్నం సాధ్యం కానే కాదు. ఇదే నీలేకని ముందున్న పెద్ద సవాలు. 113 కోట్ల కార్డులను తయారు చేయటం ఒక ఎతె్తైతే, అవి ట్యాంపర్‌ కాకుండా సాంకేతికంగా పకడ్బందీగా రూపొందించటం అంతకంటే పెద్ద సవాలు.

ముందుగా 18 ఏళ్ల పైబడ్డ వయోజనుల వివరాలను డేటాబేస్‌లో భద్రపరుస్తారు. 2011 జనగణన తోనే ఇది జరుగుతుంది. దీంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉన్న ఓటర్ల వివరాలనూ సేకరిస్తారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని యుఐఏఐతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఇసి ప్రకటించింది కూడా. అయితే ఈ కార్డుల తయారీ ఏ ఒక్క కంపెనీ వల్లనొ సాధ్యం కాదు. మూడు నాలుగు పెద్ద కంపెనీలు పూనుకుంటే తప్ప కార్యక్రమం వేగంగా పూర్తి కాదు. సవాళ్లను సంతోషంగా స్వీకరించే మనస్తత్వం ఉన్న నీలేకని ఉత్సాహంతోనే బాధ్యతలను స్వీకరించారు. మరి ఆయనకు వివిధ విభాగాల్లోని బ్యూరోక్రసీ ఏమేరకు సహకరిస్తుందో చూడాలి?

బయో మెట్రిక్‌ కార్డు జారీ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ మన దేశంలో లోపాలకు తావు లేకుండా, అక్రమాలకు ఆస్కారం లేకుండా, అవినీతి చొరబడకుండా కార్డులను జారీ చేయటం సాధ్యమవుతుందా? మాఫియాలు, టెరర్రిస్టులు, అక్రమచొరబాటు దారులు ఈ కార్డులను సంపాదించుకునే అడ్డదారులు మూతబడతాయా?

మన దేశంలో తలచుకుంటే సాధ్యం కానిదేదీ ఉండదు. ముంబయిలో బీభత్సం సృష్టించిన దావూద్‌ ఇబ్రహింకు ఈజీగా పాస్‌పోర్‌‌ట దొరుకుతుంది. అబూసలేం ప్రియురాలు మోనికాబేడీకి కర్నూలు నుంచి రెసిడెన్‌‌స సర్టిఫికేట్‌ లభిస్తుంది. అబ్దుల్‌ కరీం తెల్గీకి ఏకంగా నాసిక్‌ ప్రభుత్వ ముద్రణాలయాల లోపలి నుంచే స్టాంపు కాగితాల డైలు లభిస్తాయి. వాటిని తీసుకుని అతను వేల కోట్ల రూపాయల నకిలీ స్టాంపులు తయారు చేస్తాడు.. ఇక కార్డుల సంగతి చెప్పేదేముంది? ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్న కుటుంబాల కంటే ఎక్కువగా రేషను కార్డులు జారీ చేసిన మాట వాస్తవం. ఇప్పుడు వాటిని ఎలా ఏరివేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంత చక్కగా ఉన్న వ్యవస్థలో మోసానికి తావు లేకుండా, బోగస్‌కు అవకాశం ఇవ్వకుండా బయోమెట్రిక్‌ కార్డును తయారు చేయటం సాధ్యమేనా? అంటే అనుమానమే. ఈ విషయాన్ని నందన్‌నీలకేని కూడా అంగీకరిస్తున్నారు. టాంపర్‌ ప్రూఫ్‌ కార్డును రూపొందించటమే తన లక్ష్యమంటున్నారు. కార్డు టాంపర్‌ ప్రూఫ్‌ కావచ్చు. కానీ, జారీ చేయటంలో ఎలాటంటి లోపాలు తలెత్తవన్న గ్యారంటీ ఏమిటి? ఇందులో ఓటు బ్యాంకురాజకీయాలు జోక్యం చేసుకోవన్న నమ్మకం ఏమిటి? ఈ ప్రశ్నలకు ఎవరిదగ్గరా జవాబు లేదు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ నుంచి చొరబాటుదారులు పెరిగిపోయారు. ఎల్‌ఓసి నుంచి పాక్‌ తీవ్రవాదుల ప్రవేశం సంగతి సరేసరి. అటు మావోయిస్టులు నేపాల్‌ దాకా రెడ్‌కారిడార్‌ నిర్మించుకుంటున్నారు. ఈశాన్యంలో చైనా నుంచీ ముప్పు పొంచి ఉంది. ఇటు శ్రీలంకలో యుద్ధం ముగిసినా, దేశంలోకి వలస వస్తున్న శరణార్థుల వల్ల దక్షిణ భారత దేశంలో ఆందోళన తీవ్రమైంది. హైదరాబాద్‌లో వీసాల గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నవారూ తక్కువేం కాదు.. యూనిక్‌ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలంటే వీరందరినీ విడిగా గుర్తించాల్సి ఉంటుంది. అక్రమార్కులపై చర్యలు తీసుకోవలసి ఉంటుంది. దేశద్రోహులను తరిమేయాల్సి ఉంటుంది. ఓటుబ్యాంకురాజకీయాల్లో నిండామునిగిన రాజకీయవ్యవస్థలో ఇది సాధ్యమవుతుందని భావించలేం. అదే జరిగితే యూనిక్‌ ఐడెంటిటీ కార్డు దేశ భవిష్యత్తును బంగారు బాటవైపు మళ్లిస్తుందనటంలో సందేహం లేదు.

2 కామెంట్‌లు:

Sujata M చెప్పారు...

ఒకే సమాచారం ఇచ్చినా, రెండు మూడు పాన్ కార్డులు తయారౌతూన్న రోజులు. అందులోనూ, తప్పులూ, ఓటర్ ఐ.డీ. ల్లో అక్షరమక్షరం తప్పు తడకలు ! ఇలా, ఈ కార్డుల్లోనూ బోల్డన్ని తప్పులు దొర్లొచ్చు ! ఉద్దేశ్యం మంచిదే. కోట్లాది మందికి ఉపాధి కల్పించనున్న ప్రోజెక్టు. అయితే ఇరుగుపొరుగు దేశాల్నుంచీ చొరబడిన వాళ్ళు కూడా ఈజీగా ఈ కార్డు సంపాయించేసే అవకాశాల గురించే భయాలన్నీ ! మంచి టపా !

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

kotladi mandiki upadhi.....
prati danlo upadhichoodatam baaledu