సంస్కరణలు లేవు.. సంక్షేమం లేదు.. మాంద్యానికి మందు లేదు.. ధరల తగ్గింపు ఊసు లేదు.. యుపిఎ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువా త కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరిది. దేశంలో ఏ ఒక్క రంగానికీ రుచించని ఏకైక బడ్జెట్ స్వతంత్ర భారతంలో బహుశా ఇదే మొదటిదేమో... స్లోడౌన్ అయిన ఎకానమీ, మైనస్‌లోకి పడిపోయిన ఇన్ఫే్లషన్‌ల నేపథ్యంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న దేశ ప్రజలకు ప్రణబ్ పద్దు నిరాశనే మిగిల్చింది.
వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో తాము చేసిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకునే దిశగా యుపిఎ సర్కారు బడ్జెట్ ప్రవేశపెడుతుందని ఎంతో ఆశతో ఎదురు చూసినవారికి ఆశాభంగమే ఎదురైంది. మింటికెక్కిన ధరలను నేలకు దించటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కనీసం ప్రస్తావనైనా చేయలేదు. గ్లోబల్ ఎకానమీ స్లోడౌన్‌ను ఎదుర్కోవటానికి, దేశాన్ని గట్టెంకించటానికి ప్యాకేజీలను ప్రకటించారు. పన్ను రిలీఫ్, పబ్లిక్ ప్రాజెక్టుల్లో ఖర్చు మొత్తాన్ని పెంచటం వంటి చర్యలు ప్రకటించారు కానీ, దాని ప్రభావం పరిస్థితిలో అంత వేగంగా మార్పు తేలేకపోవచ్చు. 200809లో స్థూల జాతీయోత్పత్తి రేటు 6.7 శాతం ఉంది. దీన్ని వీలైనంత త్వరగా 9శాతం తీసుకువస్తామని ప్రణబ్ ముచ్చటగా చెప్తున్నారు. దేశాభివృద్ధి కోసం లోతైన, విస్తారమైన అజెండాను అమలు చేస్తామన్న ఆర్థిక మంత్రి అదేమిటన్నది మాత్రం వివరించలేదు. ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయికి చేరువయ్యేలా చేయటం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలుగా ప్రణబ్ చెప్పుకొచ్చారు. మరి అందుకోసం ఎలాంటి చర్యలూ బడ్జెట్‌లో ప్రసంగంలో కన్పించలేదు.
దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో బడ్జెట్ ప్రసంగం స్పష్టంగానే ఆవిష్కరించింది.
గత మూడేళ్లలో జిడిపి 9 శాతం నుంచి 6.7శాతానికి పడిపోయింది.
నిరుడు 13 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం మైనస్‌లోకి పడింది.
జిడిపిలో సర్వీసుల రంగం వాటా 50 శాతం చేరుకుంది.
దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న సంగతిని స్వయంగా అంగీకరించిన ప్రణబ్ ఇందుకోసం చేశారంటే జవాబు మాత్రం దొరకదు. దేశ చరిత్రలో మొత్తం వ్యయం మొట్ట మొదటిసారిగా పది లక్షల కోట్లను దాటిపోయింది. ఇది ఒక రికార్డుగా ప్రణబ్ చెప్పుకున్నారు. ప్రణాళికా వ్యయాన్ని 37శాతం పెంచితే, ప్రణాళికేతర వ్యయాన్ని 34శాతం పెంచారు. ఖర్చు పెరిగింది.. కానీ దాని వల్ల ఒరిగేదేమీ లేదు. వడ్డీ చెల్లింపులు 2.25లక్షల కోట్లు దాటింది. సబ్సిడీలేమో 1.11లక్షల కోట్లను మించిపోయాయి. ద్రవ్యలోటు జిడిపిలో 6.8 శాతం పెరిగింది. రెవెన్యూ లోటు కొద్దిగా తక్కువగా 4.8శాతం ఉంది. వీటిని నియంత్రించే మెకానిజం ఏమిటో ప్రణబ్ బడ్జెట్‌లో దుర్భిణీ వేసి వెతికినా కనపడదు.
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సిఫారసు చేశారనో.. సోనియాగాంధీ కోరారనో, ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకాక్షించారనో.. ఒకటి రెండు రాయితీలు, ప్రధాని ఆదర్శ గ్రామ్ వంటి ఓ సంక్షేమ పథకాన్ని ప్రకటించారే తప్ప, బడ్జెట్‌లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటం, ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించటం అన్నవి ఆయనకు గుర్తుకు వచ్చినట్లు లేదు. ఈ బడ్జెట్‌లో ఆయన చేసిందంటూ ఏదైనా ఉన్నదంటే అది మౌలిక వసతుల రంగానికి భారీగా వరాలు కుమ్మరించారు. జాతీయ మౌలిక వసతుల ఆర్థిక సంస్థను ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఇన్‌ఫ్రా రంగం బాగోగుల్ని పర్యవేక్షిస్తారు. మౌలిక వసతులకు సంబంధించిన అన్ని విభాగాలకూ ప్రోత్సాహకాలు ఇచ్చారు. మరో పక్క వ్యవసాయ రంగంపైనా పెద్దగా వరాలిచ్చిందేమీ లేదు. ఉన్న వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించారు. రుణమాఫీ పథకాన్ని మాత్రం మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఇంతకు మించి వ్యవసాయ రంగానికి ఆయర చేసిన, చెప్పుకోదగినంత మేలు ఇంకోటి లేదు. బడ్జెట్ కేటాయింపులను నామమాత్రంగా పెంచారు. అరవై శాతం జనాభా ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రకటించాలన్న డిమాండ్ వస్తుంటే, ఆ రంగానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం ఇదేనని తెలిశాక ముక్కున వేలేసుకోని వారు ఉంటారా? పోనీ మధ్య తరగతి ఉద్యోగులకు ఊరట లభించిందా అంటే పన్ను రాయితీని పదివేల రూపాయలు పెంచి చేతులు దులుపుకున్నారు. పరోక్ష పన్నుల విషయంలోనూ ఆయన వేళ్లపై లెక్కించదగిన వస్తువుల విషయంలో మాత్రమే మార్పులు చేశారు. చాలా వస్తువులు, ఉత్పత్తుల గురించి పట్టించుకోలేదు. గ్లోబల్ రెసిషన్ కారణంగా తీవ్ర ప్రభావం పడ్డ టెక్‌సటైల్ రంగాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఇరిగేషన్ రంగంపైనా ప్రణబ్ చిన్న చూపే చూశారు. ఉన్నత విద్యకు పెద్ద పీట వేసిన ప్రణబ్ వైద్యరంగంలో కొన్ని లైఫ్‌సేవింగ్ డ్రగ్‌సపై ధరలు తగ్గించి ఊరుకున్నారు జాతీయ ఆరోగ్యబీమా పథకం పరిధిలోకి బిపిఎల్ కుటుంబాలన్నింటినీ తీసుకువచ్చారు.
మొత్తం మీద ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ మూడు పొడిగింపులు, ఆరు కొనసాగింపులన్నట్లుగా సాగింది. పట్టు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ఈ బడ్జెట్ ఎలాంటి దిశ, దశా చూపించలేదు. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై క్షణాల్లోనే పడింది. ఎవరికీ మింగుడుపడని, అంతుపట్టని, అనూహ్యమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రణబ్ ముఖర్జీకే చెల్లింది.
1 కామెంట్:
brother santhosh hatsaaf to u? articles, mee bio-data tho saha total blog super. alage continue cheyyandi plz.
కామెంట్‌ను పోస్ట్ చేయండి