2, జులై 2009, గురువారం

సికిందరాబాద్‌ను మమత కరుణిస్తుందా?

రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఎలాగూ అన్యాయం జరుగుతూనే ఉంది. కనీసం రైల్వే స్టేషన్ల ఆధునీకరణ విషయంలోనైనా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందా అంటే అదీ లేదు.. దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రమైన సికింద్రాబాద్‌ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని కాగితాలపైనైతే హామీలు కురిపించారు. రైల్వే మంత్రిత్వ శాఖకు మాత్రం దీని ప్రతిపాదనలు పట్టించుకునే తీరికా లేదు.. ఓపికా లేదు.. మన ఎంపిలకు రైలు మంత్రిని అడిగే సత్తా అంతకంటే లేదు... దేశంలోని మెట్రో నగరాల్లో ఒకటి గ్రేటర్‌ హైదరాబాద్‌.. దక్షిణమధ్య రైల్వేకు కేంద్ర స్థానం సికిందరాబాద్‌.. రైల్వేలకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్న జోన్‌ దక్షిణ మధ్య రైల్వే.. రోజూ లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు తోడ్పడుతున్న స్టేషన్‌... దక్షిణాదిలో అతి పెద్దరైల్వే స్టేషన్లలో ఒకటైన సికిందరాబాద్‌.. స్టేషన్‌ వివక్షకు గురి అయినంతగా మరే స్టేషనూ కాలేదేమో... ఇంత కీలకమైన స్టేషన్‌ విషయంలో రైల్వే శాఖ ఎప్పటికప్పుడు వాగ్దానాలు చేయటం తప్ప నిర్మాణాత్మకంగా చేసింది ఏమీ లేదు. 4వేల కోట్ల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలతో భవనాలు నిర్మించటం, హోటళు్ల, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్‌‌స, బ్యాంకులు, ఎటిఎంల వంటి సదుపాయాలతో స్టేషన్‌ను ఆధునీకరించాలని ప్రతిపాదించారు. అధిక భాగం ప్రైవేటు భాగస్వామ్యంతోనే దీన్ని పూర్తి చేయాలనీ అనుకున్నారు. ఇందుకోసం సర్వే కూడా పూర్తయింది. కానీ, బడ్జెట్‌ కేటాయింపుల దగ్గరకు వచ్చేసరికి సదరు మంత్రులు మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నారు. భద్రతా చర్యల విషయంలోనైనా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారా అంటే అదీ లేదు. విమానాశ్రయాల్లో మాదిరిగా సికిందరాబాద్‌ స్టేషన్‌లోనూ బ్యాగేజీ స్కానర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మరి కొన్ని భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. అదీ లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరికి వారు తమకేమీ పట్టనట్లు వ్యవహరించటం పెద్ద సమస్య. దీనివల్లే అంతర్జాతీయ స్థాయిగా ఎదుగుతుందనుకున్న సికిందరాబాద్‌ స్టేషన్‌ జాతీయ స్థాయి సౌకర్యాలకైనా నోచుకోలేని పరిస్థితి నెలకొంది.

కామెంట్‌లు లేవు: