28, జులై 2009, మంగళవారం

వై.ఎస్.సవాలు...చంద్రబాబు ప్రతిసవాలు...

శాసనసభలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుల మధ్య చోటుచేసుకున్న సవాళ్లపర్వం కొత్తదికాదు కాని, ఈసారి మరింత స్పష్టతగా సాగిందని చెప్పవచ్చు. ఇద్దరు నేతల మధ్యే ఇలాంటి పోటీ జరిగితే ఎలా ఉంటుంది? వినడానికే ఎంతో రంజుగా ఉంటే, నిజంగా జరిగితే భలేగా ఉంటుందని చెప్పవచ్చు. విశ్వసనీయత విషయంలో ముఖ్యమంత్రి సవాలు విసిరితే, విశ్వసనీయత, అవినీతి, హత్యా రాజకీయాలు, పరిపాలన అంశాలలో చంద్రబాబు ప్రతి సవాలు విసిరారు.

వీరిద్దరి సవాళ్లను ఇతర పక్షాల నేతలు జయప్రకాష్ నారాయణ, చిరంజీవి, గుండా మల్లేష్, కిషన్ రెడ్డి తదితరులు దీనిని ఆక్షేపించి, ప్రజాసమస్యల పరిష్కారానికి సవాలు విసురుకోవాలని, రాజ్యాంగంలో రిఫరెండమ్ కు అవకాశం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తెలంగాణ అంశం మీద ఆ రిఫరెండమ్ నడిపితే బాగుంటుందని హారీష్ రావు అన్నారు. కొత్త శాసనసభ ఏర్పడిన తర్వాత ఈ ఇద్దరు నేతలు ప్రత్యక్షంగా తలపడడం ఇదే మొదటిసారి. పార్టీ విఫ్ శైలజానాద్ చేసిన ప్రసంగానికి కొనసాగింపుగా వై.ఎస్.సవాలు విసిరి, రిఫరెండమ్ లో ఓడినవారు రాజకీయ సన్యాసం తీసుకోవాలని షరతు పెట్టారు. సవాలు విసిరినప్పుడు ప్రతి సవాలు ఉండనే ఉంటుంది.
ముప్పై ఒక్క ఏళ్ల క్రితం శాసనసభలో ప్రవేశించిన ఈ ఇద్దరు నేతలు, గత పాతికేళ్లుగా రాష్ట్ర రాజకీయాలలో అత్యంత ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు. గత పదిహేను సంవత్సరలుగా వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉంటోంది. ఇంతటి అవకాశం రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరే ఇద్దరు నేతలకు రాలేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పటి మిత్రులైన వీరు వర్తమాన పదవీ రాజకీయాలలో ఘాటైన విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను వీరిద్దరీ మధ్యే తిరిగేలా చేసుకోగలుగుతున్నారు. రాజ్యంగంలో అవకాశం ఉండకపోవచ్చు. కాని శాసనసభలో ఇలాంటి సవాళ్లు ఇంతకు ముందు కూడా వచ్చాయి.
కొందరైతే రాజీనామా పత్రాలు సమర్పించి షరతులతో కూడిన సవాళ్లను విసిరిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే వై.ఎస్. చంద్రబాబుల మధ్య సవాళ్లు కాబట్టి ప్రాధాన్యత ఏర్పడింది. చంద్రబాబు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ధైర్యం ఉంటే మేయర్ ఎన్నిక ప్రత్యక్షంగా పెట్టమని సవాలు కొనసాగించడం ద్వారా ఇంకో అడుగు ముందుకు వేశారు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం. వారు విసురుకున్న సవాళ్లలో కొన్నిటిలో వై.ఎస్.కు, మరికొన్నిటిలో చంద్రబాబుకు అనుకూలంగా ప్రజాభిప్రాయం రావచ్చు. అప్పుడు వీరిలో ఎవరూ రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం ఉండదు.
రాజకీయాలలో ఉన్నవారంతా చెప్పేవన్నీ నిజాలని జనం అనుకోవడం లేదు. అలాగే ఎవరి పాలనలోనైనా లోపాలు ఉంటాయి. కాకపోతే కొంచెం తరతమ బేధాలు ఉండవచ్చు. అవినీతి రహితంగా రాజకీయం సాగుతోందని ప్రజలు ఎవరూ భావించడం లేదన్న సంగతి వై.ఎస్. చంద్రబాబులకు తెలియని రహస్యం కాదు. కాకపోతే వీటన్నిటిలో ఎవరిది పైచేయి అన్నది తేల్చుకోవడమే వీరి లక్ష్యం కావచ్చు. వీరిద్దరి సొంత ఖర్చుతో ఇలాంటి రిఫరెండం పెడితే ఎవరికి అభ్యంతరం ఉండనవసరం లేదు. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం ఎందుకన్న సామెత ఇక్కడ బాగా అతుకుతుందేమో.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి