28, జులై 2009, మంగళవారం

రాములమ్మ ముసుగు తొలగింది


విజయశాంతి రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారో.. ఎందుకు ప్రవేశించారో.. ఏం చేశారో.. ఏం సాధించారో.. ఆమెకు కూడా క్లారిటీ ఉన్నట్లు కనిపించదు. అప్పట్లో భారతీయ జనతాపార్టీ అధికారాన్ని అనుభవించిన రోజుల్లో విద్యాసాగర్‌ రావు లాంటి వాళ్ల ద్వారానో.. మరో మార్గంలోనో అద్వానీని కలిసి ఆ పార్టీలో చేరారు. ఆమె నటించిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాల గురించి లేడీ అమితాబ్‌గా ఆమె తెచ్చిపెట్టుకున్న ఇమేజిని భూతద్దంలో చూపించేసరికి అద్వానీ లాంటివారు కూడా ఆమెకున్న ప్రజాదరణ గురించి అతిగా అంచనా వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయశాంతి వల్ల తమ పార్టీకి కొద్దో గొప్పో సీట్లు రాకపోతాయా అని ఆశపడ్డారు. జాతీయ స్థాయిలో మహిళా విభాగానికి నాయకురాలిని చేశారు. బిజెపిలో చేరిన తరువాత ఆమె ఎన్ని సభల్లో పాల్గొన్నారో తెలియదు కానీ, ఆమె వల్ల ఆ పార్టీకి ఒరిగిందేమిటని ఆలోచిస్తే... నిండు సున్నాయే కనిపిస్తుంది.

తాను బిజెపి జాతీయ స్థాయి నాయకురాలినని తన ఇమేజీని పెంచుకునే ప్రయత్నం చేసుకున్నారే కానీ, రాష్ట్రంలో పార్టీని ఒక్క అడుగైనా ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. ఆ తరువాత ఉన్నట్టుండి ఆమెకు తెలంగాణ గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. బిజెపిలో ఉంటూనే అకస్మాత్తుగా తెలంగాణపైనా, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపైనా అవ్యాజమైన ప్రేమానురాగాలని కురిపించటం ప్రారంభించారు. అప్పటికే కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌ ప్రారంభించారు. అటు బిజెపిలో ప్రాపకాన్ని, ప్రాభవాన్ని కోల్పోయిన నరేంద్ర బయటకొచ్చి సొంత కుంపటి పెట్టుకున్నట్టే పెట్టుకుని అంతలోనే టిఆర్‌ఎస్‌ నదిలో తన కుంపటిని నిమజ్జనం చేసారు. ఇక విజయశాంతి ఒక్కసారిగా రాములమ్మ అవతారం ఎత్తారు. అటు అన్న కెసిఆర్‌ అయితే, ఇటు విజయశాంతి తెలంగాణా ప్రజల పాలిటి అక్క రాములమ్మ అయిపోయారు.

ఆమె భజన బృందం ఇంకో అడుగు ముందుకేసి విజయశాంతి పేరును మరిపించి రాములమ్మ పేరునే ఖాయం చేసేశారు..గోడలపై రాతల్లో రాములమ్మ పేరే... అతికించే పోస్టర్లలో రాములమ్మ వేషమే.. ఎక్కడ చూసినా రాములమ్మే తప్ప విజయశాంతి పేరే కనపడని స్థాయిలో ప్రచారం చేసుకున్నారు. ఆమెతో పాటు ఆమె వెంట నడిచే ఓ వందమంది వందిమాగధ బృందం అంతా కలిసి తమదంతా ఓ రాజకీయ పార్టీ అన్నారు. దానికి తల్లి తెలంగాణ అని పేరూ పెట్టుకున్నారు. ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్లి పార్టీ పేరును రిజష్టర్‌ కూడా చేసేసుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ, అసలు అయోమయం తొలగనే లేదు.. సందేహం తీరనే లేదు. ఇంతకీ అక్క రాములమ్మకి తెలంగాణ ఉద్యమం చేపట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందని... ఎవరికీ అర్థం కాలేదు.. చివరకు ఆమెనే అడిగారు.. ఏమిటీ సంగతని.. అప్పుడు ఆమె గుట్టు విప్పారు. తనది తెలంగాణ ప్రాంతమేనని, తాను పుట్టింది వరంగల్‌ జిల్లా రామన్నపేటలోనేనని... ఆశ్చర్యపోవటం అందరి వంతయింది. అప్పటి వరకు ఆమె ఆంధ్రప్రాంతానికి చెందిన తారగానే అందరికీ తెలుసు. సినీనటి విజయలలిత అక్క కూతురు అని కూడా తెలుసు. కానీ, ఆమె పూర్వీకులు రామన్నపేటకు చెందినవారన్నది ఆమె చెప్పేంత వరకూ ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని ఆక్షేపించనవసరం లేదు. ఎవరికీ అభ్యంతరమూ ఉండనవసరం లేదు.. సరే.. మొత్తం మీద తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించానన్నారు. కానీ, తెలంగాణ గురించి ఆమెకున్న అవగాహన అంతంత మాత్రమేనని తొలి ప్రసంగంలోనే తేటతెల్లమైంది. ఆ తరువాత కూడా తెలంగాణ ప్రాంతం గురించి కానీ, సమస్యల గురించి కానీ ఆమె పెంచుకున్న అవగాహన పెద్దగా కనిపించదు. పడికట్టు పదాల ప్రసంగాలతోనే మొన్నటి ఎన్నికల దాకా నెట్టుకొచ్చారు. వాస్తవానికి ఎన్నికలు ముంచుకొచ్చేసరికి తానేం ఏం చేయాలో.. రాజకీయ మనుగడ ఎలా కొనసాగించాలో అర్థం కాలేదు. అదే సమయంలో అటు కెసిఆర్‌ తన అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం వెంపర్లాడుతున్న పరిస్థితిని విజయశాంతి తెలివిగా క్యాష్‌ చేసుకున్నారు. ఇంకేం తల్లి తెలంగాణ టిఆర్‌ఎస్‌తో మమేకమైపోయింది. పార్టీని బెదిరించి మరీ మెదక్‌ సీటు సాధించుకున్నారు. హరీశ్‌రావు మెజారిటీ పుణ్యమా అని స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. కానీ, తరువాత టిఆర్‌ఎస్‌లో మొదలైన సంకుల సమరం విజయశాంతికి పాలుపోని పరిస్థితి కల్పించింది. ఇంకా ఈ పార్టీలోనే ఉంటే తనకు మనుగడ కష్టమని దాదాపు నిర్థారణకు వచ్చినట్టున్నారు... దాని పర్యవసానమే... సచివాలయంలో ఓ ఫైన్‌ మార్నింగ్‌ విజయశాంతి ప్రత్యక్షం కావటం... వైఎస్‌ను కలవటం... తన నియోజక వర్గానికి మేలు చేస్తున్నందుకు రాజకీయ ధన్యవాదాలు చెప్పేయటం చకచకా జరిగిపోయాయి. తెలంగాణ రంగు చెదిరింది... రాములమ్మ ముసుగు తొలిగింది.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి