5, జులై 2009, ఆదివారం

వేయి అద్భుతాలు - వేయి స్తంభాలు


ఒక మహా సామ్రాజ్యం ఔన్నత్యం అన్నది అది నిర్మించిన భవంతుల పైనో... దేవాలయాల పైనో నిలబడదు. ఆ రాజులు పోషించిన లలిత కళల పైనా, సాహిత్య, సంప్రదాయాలపైనా ఆధారపడదు. వారు సాగించిన జైత్రయాత్రల వల్లనో, రాజ్య విస్తరణ కారణంగానో దాని అస్తిత్వం ఎంతోకాలం మనుగడ సాగించలేదు. ఆ సామ్రాజ్యం అంతమైపోయి ఎంతోకాలం గడిచిన తరువాత కూడా ఆ ప్రాంతంలోని ప్రజలు తమ భూభాగాన్ని ఏలిన రాజుల చరిత్రను, వారి పరిపాలనా రీతిని నిరంతరం జ్ఞప్తికి తెచ్చుకోవడంపైనే ఆ సామ్రాజ్యపు ఉన్నతి కలకాలం నిలబడుతుంది. వారి పరిపాలన ఫలాలను వందల సంవత్సరాల తరువాత కూడా ప్రజలు అనుభవించడం ఆ సామ్రాజ్యం చిరస్థాయిగా చరిత్రపుటల్లో నిలబడటానికి దోహదపడుతుంది.
దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం వరంగల్లు నగరాన్ని రాజధానిగా చేసుకొని తెలుగు గడ్డను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యపు ప్రశస్తి ఈనాటికీ తెలంగాణ ప్రాంత వాసుల్లో కణకణం ప్రతిస్పందిస్తుంటుంది. ఇక వరంగల్లు పట్టణ వాసులయితే వారిని తలవని క్షణం ఉండదు.

ఈ నగరంలో చిన్న సంస్థల నుంచి, పెద్ద పెద్ద సంస్థల వరకు `కాకతీయ' నామం ఉండటం ఇందుకు నిలువెత్తు నిదర్శనం. తెలంగాణ ప్రజల హృదయాలను నిత్యం స్పర్శిస్తూ ఉన్న కాకతీయ శబ్దం కేవలం కేవలం ధ్వనిమాత్రం కాదు... ఆ శబ్దాన్ని యాదృచ్చికంగా ఉపయోగిస్తున్నారని తేలిగ్గా కొట్టిపారేయలేం. తెలుగు వారిని ఎందరో రాజులు పరిపాలించారు.. అత్యున్నతమైన పరిపాలనను అందించారు. కానీ, కాకతీయ రాజ్యానికి ఇవాళ్టికీ లభిస్తున్న ప్రశంస మరే రాజ్య వంశానికీ లభించలేదంటే అది అత్యుక్తి ఎంతమాత్రం కానేరదు. విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన శ్రీకృష్ణ దేవరాయలను సైతం సాహితీసమరాంగణ సార్వభౌముడిగా గుర్తిస్తామే తప్ప, పరిపాలనా పరంగా కాకతీయుల సామ్రాజ్యనిరా్మణ వూ్యహం ముందు నిలువదగిన వారు అరుదనేచెప్పాలి.
ఇప్పుడు ఇంత హఠాత్తుగా కాకతీయుల ప్రసక్తి తీసుకురావడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించవచ్చు. ఎప్పుడో ఏడువందల సంవత్సరాల క్రితం గతించిపోయిన సామ్రాజ్యాన్ని గురించిన ప్రస్తావన వెనుక విశేష చారిత్రకాంశం దాగి ఉంది. కాకతీయులు నిర్మించిన అద్భుత నిరా్మణాలలో రుద్రదేవ మహారాజు నిర్మించిన వేయి స్తంభముల దేవాలయం అపూర్వమైనది. ఇక్కడి ప్రసిద్ధమైన త్రికూటాలయం ఎదురుగా ఒక కళ్యాణ మంటపం ఉండేది. ఈ మంటపానికి ఉన్న కొన్ని స్తంభాలు కదులుతుండటంతో, దాన్ని పునర్నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఇందుకు వీలుగా మంటపానికి ఆధారభూతంగా ఉన్న స్తంభాలను, ఉపరితలానికి ఉపయోగించిన కొండ రాళ్లను తొలగించి ఆ ప్రాంతాన్ని చదును చేశారు. కాకతీయులు నిర్మించిన విధంగానే ఈ మంటపాన్ని అదే స్థలంలో యథాతథంగా తిరిగి నిలబెట్టడం కోసం ప్రభుత్వం మూడున్నర కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసింది. అంతే కాదు..వరంగల్‌ లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) నిపుణుల పర్యవేక్షణలో పునర్మిరా్మణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇంతవరకు బాగాసే ఉంది. ఇక్కడే అసలు అయోమయం మొదలయింది.
కళ్యాణ మంటప నిరా్మణం కోసం పునాదుల తవ్వకం మొదలయింది. భూమి అడుగున తవ్వకం ప్రారంభించిన వెంటసే ఇసుక బయటపడింది. రెండు మీటర్ల ఇసుక తొలగించగాసే అందులోంచి భారీగా నీరు బయటకు ఉబికి రావడం మొదలయింది. ఇవాళ అన్ని సందేహాలకూ ఈ నీరే కారణమైంది. నీటిని ఎంతగా తొలగించాలని ప్రయత్నించినా ప్రవాహం మాత్రం ఆగలేదు. దాదాపు రెండు రోజుల పాటు భారీ మోటార్లను ఉపయోగించి నీరు బయటకు తీసినా నీరు అనంతంగా ఉబికివస్తూనే ఉన్నది. వేయి స్తంభాల గుడికి చుట్టుపక్కలా వరంగల్‌ నగరం విస్తృతంగా విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో ఇళ్లకోసం బోరు బావులు వేసుకోవాలంటే కనీసం రెండుమూడు వందల అడుగుల దాకా డ్రిల్లింగ్‌ చేయవలసిందే. అలాంటిది ఇక్కడ పునాది స్థాయిలోనే నీరు బయటపడటం ఏమిటి? నీటి పునాదిపై భారీ రాతి స్తంభాలతో నిరా్మణం సాగించడం సాధ్యమయ్యే పనేనా? ప్రపంచంలో ఇంతవరకు జరిగిన చారిత్రక పరిశోధనల్లో నీరు, ఇసుక కలిసిన పునాదిపై నిరా్మణాలు చేసినట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు. తవ్విన కొద్దీ ఇసుక, నీరు తప్ప మరే నిరా్మణ సామాగ్రి కనిపించడం లేదు. ఈ నీరు ఎక్కడినుంచి వస్తున్నదనే విషయమై మరింత తవ్వి చూస్తే ఇనుప గొట్టాలు బయటపడ్డాయి. ఈ గొట్టాల నుంచే నీరు వస్తున్నట్లు నిపుణులు కనుగొన్నారు. అయితే ఈ గొట్టాలు ఎక్కడిదాకా ఉన్నాయన్నది మాత్రం అంతుచిక్కలేదు. వేయి స్తంభాల గుడికి సమీపంలో ఉన్న భద్రకాళి చెరువు, పద్మాక్షి గుండం నుంచి నిరంతరంగా నీరు పునాదికి చేరేందుకు వీలుగా ఈ గొట్టాలను ఏరా్పటు చేశారేమో కనుక్కోవలసి ఉంది. నీటి తొలగింపు సాధ్యం కాకపోవడంతో తప్పనిసరిగా పునర్నిరా్మణ పనులను ఆపివేయవలసి వచ్చింది. చివరకు ఈ అపురూప నిరా్మణపు సాంకేతికత ఆనుపానులను కనుక్కొనే బాధ్యతను పురాతత్త్వ శాఖకు ప్రభుత్వం అప్పగించింది.
తెలుగు దేశం అంతటినీ ఒక్కటి చేసి శాతవాహనులు పరిపాలించిన వెయ్యేళ్ల తరువాత తిరిగి తెలుగువారందరినీ ఒకే ఏలుబడిలోకి తీసుకువచ్చిన వారు కాకతీయులు. దాదాపురెండు శతాబ్దాల పాటు తెలుగుదేశాన్ని పరిపాలించి రాజకీయంగానూ, సాంఘికంగానూ తెలుగుజాతికి విశ్వవ్యాప్తమైన కీర్తి ప్రతిష్ఠలు కల్పించిన వారు కాకతీయులు. దక్షిణాన కంచి నుంచి తూర్పున దక్షిణ కళింగ వరకు, కోస్తా, తెలంగాణా ప్రాంతాలతో పాటు, ఆదోని, రాయచూరు, బీదరు కోటల దాకా కాకతీయ సామ్రాజ్యం విస్తరిల్లింది. క్రీస్తు శకం 1050 సంవత్సరంలో మొదటి ప్రోలరాజుతో ప్రారంభమైన కాకతీయుల పరిపాలన క్రీస్తు శకం 1323 వరకు అప్రతిహతంగా కొనసాగింది. కాకతీయులు మొదట జైన మతావలంబులు. ఈ ప్రాంతంలో వీరశైవం ప్రబలిన తరువాత కాకతీయులు కూడా శైవమతాన్ని అవలంబించారు. కాకతీయ ధ్వజంపై విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన వరాహ మూర్తి చిహ్నంగా ఉన్నప్పటికీ వీరు మాత్రం శైవాన్ని పెంచి పోషించారు. జైనమతాన్ని అవలంబించిన కాలం నాటి అనేక నిరా్మణాలు ఇవాళ్టికీ వరంగల్లు చుట్టుపక్కల కనిపిస్తాయి. కాకతీయుల కాలంలో కనీసం అయిదు వందల జైన ఆవాసాలు ఉండి ఉండవచ్చన్నది చరిత్రకారుల అంచనా. హనుమకొండలోని పద్మాక్షి గుట్టపై జైన తీర్థంకరులు, యక్షిణుల విగ్రహాలు ఉన్నాయి. నాడు వీరశైవులు జైనులను ఓంు్టగల్లు నగరానికి కనీసం వంద కిలోమీటర్ల దూరం వరకు కనపడకుండా తరిమికొట్టారని కథనం. నాటి జైనుల ప్రాభవానికి వరంగల్లు సరిహద్దుల్లోని కొలనుపాక జైన దేవాలయం దర్పణం పడుతుంది. కాకతీయులు శైవాన్ని పోషించడం ప్రారంభించిన తరువాత అనేక జైన మంటపాలను కళ్యాణ మంటపాలుగా, శైవ మందిరాలుగా మారా్చరని భావన. వేయి స్తంభాల దేవాలయంలో ప్రస్తుతం పునర్నిరా్మణం కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ మంటపం కూడా ఇలాంటి జైన మంటపమేనని అనుమానం. సాధారణంగా జైన మంటప స్తంభాలపై పూర్ణకుంభాలు కనిపిస్తాయి. ఇతర ఆలయ స్తంభాలపై వీటి జాడ ఉండదు. వేయి స్తంభాల గుడిలోని కళ్యాణమంటపంపై కూడా పూర్ణ కుంభాలు కనిపించడం గమనార్హం. కానీ, ఎదురుగా ఉన్న త్రికూటాలయంలో ఇవి ఉండవు.
సహస్ర స్తంభ దేవాలయం
కాకతి రుద్రదేవుడు హనుమకొండలోని రుద్రేశ్వర స్వామి ఆలయాన్ని సహస్ర స్తంభ మంటప సమేతంగా సరిగ్గా 843 సంవత్సరాల క్రితం 1163లో నిర్మించాడు. ఒక వైపు త్రికూటాలయం కాగా దాని ఎదురుగా కళ్యాణ మంటపం, మధ్యలో నంది మంటపం వైభవంగా అలరారుతుంటాయి. ఆలయ ప్రాంగణంలోనే లోతైన తటాకాన్ని కూడా నిర్మించారు. ఈ ఆలయ నిరా్మణమే ఒక అద్భుతమైనది. భారతీయ నిరా్మణ చరిత్రలో దీనికి సాటి వచ్చు నిరా్మణం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ రుద్రేశ్వర స్వామి ఆలయాన్ని రెండు విభాగాలుగా నిర్మించారు. చుట్టూ ఒక పటిష్ఠమైన ఆవరణాన్ని ఒకటి నిర్మించి దానికి దక్షిణ దిశలో ఒక ద్వారాన్ని, ఉత్తర దిశలో మరొక ద్వారాన్ని ఏరా్పటు చేశారు. ప్రస్తుతం ఆలయంలోకి ఉత్తర దిశ నుంచే ప్రవేశానికి అనుమతిస్తున్నారు. ఈ దిశలో ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే ఎడమ వైపున అతి పెద్ద పుష్కరిణి కనిపిస్తుంది. కుడివైపున ఎతె్తైన శిలావేదికపై త్రికూటాలయం ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దక్షిణాభిముఖంగా ఉన్నప్పటికీ గరా్భలయం తూర్పు ముఖంగా ఉంటుంది. ఆలయమంతా నక్షత్ర ఆకృతి కలిగిన పెద్ద పెద్ద రాతి పునాదులపై నిర్మించబడింది. భూమట్టము నుంచి దాదాపు ఏడెనిమిది అడుగుల ఎత్తున అలయ నిరా్మణం జరిగింది. ఆలయ నిరా్మణం అంతా నల్లని గ్రాసైటు రాళ్లతోనే జరిగింది. ప్రతి స్తంభంపైన కనిపించే నగిషీ సౌందరా్యన్ని వర్ణించడం సామాన్యుడి తరం కాదు. స్తంభాలు మాత్రమే కాదు.. ఆలయ ఉపరిభాగంలో కూడా శిల్ప సౌందర్యం అద్భుతంగా ఉంటుంది. చతురస్ర, చతుష్కోణ, వలయాకారంలో రాతి శిల్పాలను ఆలయ ఉపరిభాగంలో అమర్చడం తెలుగువాడి శిల్పకళా సైపుణ్యానికి మచ్చుతునక. దేవీ దేవతల విగ్రహాలు, నానా రకాల నాట్య భంగిమలు, కమల దళ శిల్పాలు, ఏనుగులు, గుర్రాల వంటి జంతువులు ఈ శిల్పాలలో కనిపిస్తాయి. భూమట్టానికి దాదాపు పదిహేను అడుగుల ఎత్తున ఉపరిభాగంలో ఈ శిల్పసౌందర్యం పోగుపడి ఉన్నప్పటికీ పరా్యటకులకు స్పష్టంగా గోచరించడం ఇందులోని విశేషం. ఈ ఆలయం ప్రధానంగా త్రికూటాలయం. ఇందులో రుద్రేశ్వర స్వామితో పాటు, వాసుదేవ, సూర్యదేవ ఆలయాలు కూడా ఉన్నాయి. సూర్యదేవుడి ఆలయాన్ని నిర్మించడానికి కారణం జైనమతావలంబులను సంతృప్తిపరచేందుకేనని కొందరి అభిప్రాయం. ప్రస్తుతం వాసుదేవ, సూర్యదేవ ఆలయాలు కేవలం సాధారణ గదులుగా మారిపోయాయి. ఇందులోని విగ్రహాలు ఏమైపోయినాయో తెలియదు. రుద్రేశ్వర స్వామి స్వయంభు శివలింగం మాత్రం ఈనాటికీ భక్తులను అనుగ్రహిస్తున్నది.
రుద్రేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న నందిమంటపంలో ఏకశిలపై రూపొందించిన నందీశ్వరుడి మహాద్భుత విగ్రహం ఉత్తరాభిముఖమై దర్శనమిస్తుంది. ఈ మంటపానికి ఎదురుగా ఇప్పుడు పునర్నిర్మించ తలపెట్టిన కళ్యాణ మంటపం ఉండేది. దీన్ని తొలగించడానికి ముందు ఉన్న రూపం ఈ విధంగా ఉంది. ఇది భూమట్టానికి మూడు నాలుగు అడుగుల ఎత్తుపై తెల్లని ఇసుకరాళ్లతో నిర్మితమైంది. (ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో స్వామి నారాయణ్‌ ట్రస్‌‌టవారు అపురూపంగా నిర్మించిన అక్షర ధామ్‌ ఆలయానికి వాడినవి ఎరన్రి ఇసుక రాయి కావడం గమనార్హం.) ఈ మంటపం ప్రారంభంలోనే అనేక స్తంభాలపై నిర్మించిన రెండు వసారాలు ఉంటాయి. ఈ వసారాల నడుమ ప్రధాన ద్వారం ఉంది. ప్రధాన ద్వారం దాటి లోపలికి వెళ్లిన తరువాత పదహారు స్తంభాలపై నిర్మించిన చతురస్ర ప్రాంతాన్ని చూస్తాం. కాస్త కిందకు వెళ్తే మూడు నాలుగు అంగుళముల ఎత్తున నాలుగు శిలాస్తంభాల వంటి ఒక వలయం కనిపిస్తుంది. ఈ చతురస్ర ప్రాంతంలోని పదహారు స్తంభాలు కూడా పై భాగంలో కొంత చెక్కినట్లు ఉంటాయి. ఈ మంటపానికి తూర్పువైపున మూడు నాలుగు అడుగుల ఎత్తున మరో వసారా ఉంటుంది. అదే విధంగా పడమటి వైపున మరో వసారా ఉంటుంది. ఈ వసారా అన్ని వైపులా తెరిచే ఉండటం, మధ్యలో ఒక వేదిక ఉండటాన్ని పరిశీలిస్తే ఇది ఒక చిన్న ఆలయంగా ఉపయోగించినట్లు భావించవచ్చన్నది చరిత్రకారుల అభిప్రాయం. ఉత్తర, దక్షిణ దిశల్లో కూడా ఈ మంటపానికి వసారాలు నిర్మించి ఉన్నాయి. ఇప్పుడీ మంటపాన్ని యథాతథంగా నిర్మించడానికి పురాతత్త్వ శాఖ ప్రయత్నిస్తున్నది.
అపురూప నిరా్మణాలు...
కాకతీయులు నిర్మించిన ఆలయాలు కానీ, చెరువులు కానీ, కోటలు కానీ, భవంతులు కానీ, వేటికవే సాటి. కాకతీయుల శిల్ప నిరా్మణంలో రాష్టక్రూటులు, చాళుక్యుల శైలి కొట్టొచ్చినట్లు కనిపించినప్పటికీ, నిరా్మణ శైలిలో కాకతీయుల ప్రత్యేకత విశిష్టమైనదసే చెప్పాలి. రామప్ప, లక్నవరం, పాకాల, మడికొండ, ధర్మసాగర్‌ తదితర ప్రాంతాల్లో కాకతీయులు నిర్మించిన చెరువులు ఇవాళ్టికీ వేల ఎకరాల పంటపొలాలను సస్యశా్యమలం చేస్తున్నాయి. వారి తరువాత ఈ ఎనిమిది వందల సంవత్సరాలలో ఒక్క రిజరా్వయర్‌ కానీ, ఒక్క చెరువు కానీ వరంగల్‌ ప్రజలకు పరిపాలకులు అందించలేకపోయారు. ఏకశిలా నగరాన్ని అత్యున్నత మైన సాంకేతిక ప్రమాణాలతో వారు నిర్మించారు. కాకతీయుల నాలుగు కీర్తి తోరణాలు రుద్రదేవ, గణపతి, రుద్రమ, ప్రతాపరుద్రుల కీర్తి పతాకలుగా ఈనాటికీ సగర్వంగా నిలబడి ఉన్నట్లు గోచరిస్తాయి. సౌందర్యశాస్త్రాన్ని కాకతీయులు కాచివడబోశారా అన్నట్లు వారి నిరా్మణాలు కనిపిస్తాయి. పాలంపేటలోని రామప్ప దేవాలయం, హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయం వారి నిరా్మణ వైచిత్రికి ఉజ్వలమైన తారా్కణాలు.
సాంకేతికత విషయానికి వస్తే వారు చేసిన నిరా్మణాలన్నింటిలోనూ ఇసుక ప్రధాన పాత్ర వహించింది. కీర్తి తోరణాలసే పరిశీలించినట్లయితే అందులో దాదాపు మూడున్నర మీటర్ల లోతున భూగరా్భన్ని పూర్తిగా ఇసుకతో నింపారు. ఆ తరువాత దానిపైన నలభై సెంటీమీటర్ల మందంతో 3.65 మీటర్ల పొడవున్న గ్రాసైట్‌రాతి `బీమ్‌'ను ఏరా్పటు చేశారు. ఈ బీమ్‌కు రెండు వైపుల నుంచి కూడా నిర్దిష్ట పరిమాణంలో చిన్న గ్రాసైట్‌ రాతి బ్లాక్‌లను భూమట్టం దాకా ఏరా్పటు చేసి పునాదిని పటిష్ఠపరిచారు. ఆ పైన కీర్తితోరణాన్ని నిలబెట్టారు. ఈ కీర్తితోరణ స్తంభాలు ఒక్కొక్కటి సుమారు తొమ్మిది మీటర్ల ఎత్తు ఉంటాయి.
వేయి స్తంభాల గుడిలోని ప్రస్తుత కళ్యాణ మంటపం విషయానికి వస్తే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిపుణులు చేసిన పరిశోధన ప్రకారం ఇక్కడి పునాది కూడాప్రధానంగా ఇసుకపైనే ఆధారపడి ఉంది. అయితే ఇసుక కంటే ముందుగా దాదాపు మూడున్నర మీటర్ల మేర మొరంతో నింపి దానిపై మరో రెండున్నర మీటర్ల మేర బంకమన్ను దాని పైన సుమారు నాలుగు మీటర్ల వరకు ఇసుకను నింపారు. దీనిపైన భూమట్టంపై ఒక బీమ్‌ను నిర్మించి, `ఫ్లోర్‌ స్లాబ్‌'ను వేశారు. ఈ బీమ్‌ను ఆధారం చేసుకొని స్తంభాలను నిలబెట్టడం జరిగింది. స్తంభాలకు కింది బీమ్‌కు, పైనున్న బీమ్‌లకు మధ్య అవసరమైనంత ఖాళీ స్థలం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం కూడా భవన పటిష్ఠతలో భాగమే. నల్లరేగడి మన్ను భూమిలో ఉండే ప్రాంతాలలో ఇవాళ్టికీ ఇసుకతో పునాదులను పటిష్ఠం చేసే పద్ధతిని పాటిస్తున్నారు. అయితే తాజా తవ్వకాల్లో నీరు ఉబికిరావడం అందుకోసం ఇనుప కేసింగ్‌ బయటపడటం అన్నది నాటి నిట్‌ నిపుణులు అంచనా వేయలేదు. నీటిపొరపై కళ్యాణ మంటపం నిర్మించినట్లు ఊహించడానికి తగిన ఆధారాలు కూడా వారికి కనిపించలేదు. దీని ఆనుపానులు కనుక్కోవడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నీరు భద్రకాళి చెరువు, పద్మాక్షి గుండంల నుంచి వస్తున్నదని తొలుత భావించినప్పటికీ అందులో నిజానిజాలు ఎంతమాత్రమన్నది తేలాల్సి ఉంది. అయితే, కళ్యాణ మంటపానికి ఎదురుగా ఉన్న నందిమంటపం వద్ద ఒరల బావి ఒకటి ఉండేదని, ఈ బావిలోని నీరే కళ్యాణ మంటపం పునాదుల్లోకి చేరిందా అన్నది చరిత్రకారుల సందేహం. మొరం, బంకమన్ను, ఇసుక కలిపి దాదాపు పది అడుగుల మేర పునాది ఉన్నదని నిట్‌ నిపుణులు భావించిన మాటే నిజమైతే, మరి ఇప్పుడు రెండు మీటర్ల ఇసుక తవ్వగాసే నీరు ఉబికి రావడం వెనుక మర్మమేమిటి? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో ఈ రహస్యాన్ని ఛేదించడం పెద్ద కష్టం కాబోదు. ఈ రహస్యాన్ని కనుక్కోవడమే కాకుండా వీలైనంత త్వరగా కళ్యాణ మంటపాన్ని పూర్వరూపంలో పూర్వ స్థానంలో యథాతథంగా నిలబెట్టడానికి కృషి చేయడం అవసరం. నాడు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో అలంపురం దేవాలయాలను రూపం మారకుండా స్థాన చలనం చేసినట్లు, నేడు సహస్ర స్తంభ దేవాలయంలోని కళ్యాణ మంటపాన్ని కూడా కాకతీయుల కళా ప్రాభవం చెడకుండా నిలబెట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.

1 కామెంట్‌:

పుల్లాయన చెప్పారు...

కాకతీయుల గురించి, వేయి స్థంభాల గుడి ని గురించి విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు. వీలైతే ఇలాంటి సమాచారం వికి లో రాస్తుండండి.