ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తొలిసారి పోలీసు స్టేషన్ గడప తొక్కారు. రాజకీయ నాయకుడుగా పార్టీ పెట్టిన ఏడాది తరువాత ఆయన రికార్డుల్లో తొలి అరెస్టు నమోదయింది. ఆయన పార్టీ ప్రజారాజ్యం ప్రజల సమస్యలపై మొట్టమొదటి ప్రత్యక్ష ఆందోళన రాష్ట్ర వ్యాప్తం నిర్వహించింది. దేశ రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఏర్పడిన ఏడాది తరువాత కానీ ప్రత్యక్ష ఆందోళనలకు దిగకపోవటం నిజంగా ఒక చరిత్రే...
మెగాస్టార్ కటిక నేలపై కూర్చున్నాడు.. ప్లకార్డులు పట్టుకున్నాడు.. కూరగాయల దండను మెళ్లో వేసుకుని, కందిపప్పు చేతపట్టుకుని నినాదాలు చేశాడు..
ఇదంతా ఏ సినిమాలో సన్నివేశం కాదు.. అయినా సినిమాలు మానేశానన్న చిరంజీవి మళ్లీ సినిమాల్లో నటించటానికి వేసిన కొత్త వేశం అంతకంటే కాదు... చిరంజీవి లాంటి గొప్ప నటుడు, నాయకుడు ఇలా రోడ్డున పడి ఆందోళన చేస్తాడని సగటు అభిమాని కల్లో కూడా ఊహించి ఉండడు. బెంజికారు తప్ప మరొకటి ఎరుగని మెగాస్టార్‌ను సాధారణ ఆందోళన కారులను తీసుకుపోయినట్లు పాత డిసిఎం వ్యాన్‌లో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు...అక్కడ చెక్క కుర్చీలో కూర్చోపెట్టారు.. కాసేపుంచి వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
సికిందరాబాద్ ఛీఫ్ రేషనింగ్ కార్యాలయం ముందు ప్రజారాజ్యం పార్టీ నిర్వహించిన ధర్నాలో కళ్లముందు జరిగిన వాస్తవం ఇది. రాజకీయాలు అంటే తెల్లని దుస్తులు ధరించి చైతన్య రథాల్లో ఊరేగుతూ, ప్రజలకు చేతులూపుతూ.. ఉపన్యాసాలు దంచుతూ తిరగటం కాదని చిరంజీవికి పార్టీ పెట్టిన ఏడాది తరువాత కానీ తెలిసి వచ్చినట్లు లేదు. పాజిటివ్ పాలిటిక్‌స అంటూ, సామాజిక న్యాయం అంటూ రకరకాల నినాదాలతో తెరమీదకు వచ్చిన చిరంజీవికి ఎన్నికల్లో పోటీ చేయటం తప్ప, కొన్ని ప్రాంతాల్లో పీడితులను పరామర్శించటం తప్ప, సమస్యలను తనవిగా చేసుకుని వారి పక్షాన వీధుల్లోకి వచ్చి పోరాడిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు.
వాస్తవానికి రాజకీయ పార్టీలకు, ప్రజల సమస్యలపై పోరాటాలకు మధ్య బంధం పెనవేసుకుని ఉంటుంది. ఒక పోరాటాన్ని ఆసరా చేసుకునో.. సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునో ఒక పార్టీ పుట్టడం ఇప్పటివరకు దేశ రాజకీయాల్లో జరుగుతున్న తీరు. కానీ, ప్రజారాజ్యం పుట్టుక విచిత్రం... మనుగడ మరో చిత్రం. వచ్చేవాళు్ల.. పోయేవాళ్ల జాతరలతోనే కాలం గడిచిపోతోంది తప్ప.. ప్రజారాజ్యానికి ప్రజల కోసం ఏం చేయాలన్న దానిపై ఆలోచించే సమయమే చిక్కటం లేదు. పార్టీ ఉనికిని కాపాడుకోవటమే కష్టమైన పరిస్థితి ప్రస్తుతం పిఆర్‌పిది. కనీసం ఇంతకాలానికైనా ఏదో ఒక ప్రజా సమస్యపై పోరాడాలన్న ఆలోచన మెగాస్టార్‌కు వచ్చినందుకు సంతోషించాలి. చిత్తశుద్ధితో ప్రజల సమస్యల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తే పార్టీ ఉనికిని ప్రజలే కాపాడతారు.. చిరంజీవి ఈ సూత్రం ఒక్కటి తెలుసుకుంటే రాజకీయాల్లో మెగానేత కావటానికి ఎంతో సమయం పట్టదు...
1 కామెంట్:
ఒక సారి అరెస్ట్ అయితే సరిపోదు. ముందు ముందు చిరంజీవి ఏమి చేస్తాడో చూద్దాం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి