5, జులై 2009, ఆదివారం

అన్యాయం అంతరిస్తేనే నా గొడవకు సంత్రుప్తి


వ్యక్తిగా ఆయన ఎనభై తొమ్మిదేళు్ల జీవించినంతకాలం కూడా అన్నచాటు తము్మడే. ఆయన కంటే కొద్దికాలం ముందు అన్నగారు అస్తమించినా ఆయన మాత్రం అన్న లేని లోటును భావించలేదు. ఆయన తనతో సశరీరుడై ఉన్నట్లుగానే హైదరాబాద్‌ నిమ్‌‌స ఆసుపత్రిలో చేరేంతవరకూ కూడా భావించాడు. తాము మరణించిన తరువాత తమ పార్థివ శరీరాన్ని వృథాగా దహనం చేయకుండా వైద్య పరిశోధనల నిమిత్తం కాకతీయ వైద్య కళాశాలకు విరాళంగా అందించిన మహానుభావులు ఈ ఇద్దరు సోదరులు. పురాణకాలంలో ఆదర్శ అన్నదము్మలైన రామలక్ష్మణుల కథలు వినడమే కానీ, కాళోజీ సోదరుల మధ్య ఉన్న అన్యోన్యత, అనుబంధం రామలక్ష్మణుల కంటే మించినది

అన్నకు తము్మడిపై ఉన్న ప్రేమ ఎంతో.. తము్మడికీ అన్నగారంటే అంత అభిమానం. ఎక్కడైనా అన్నదము్మలు పెరిగి పెద్దవారై, ఎవరి సంసారాలు వారు ఏర్పరుచుకున్న తరువాత క్రమంగా దాయాదులుగా మారటం మనం సహజంగా చూస్తుంటాం. కాళోజీ సోదరులు మాత్రం ఆజన్మాంతం ఒకరితో ఒకరు మమేకమై, రెండు శరీరాలు ఒకటిగా కలిసి జీవించారు. ఉర్దూ, తెలుగు కవిత్వాల సంగమం కాళోజీ సోదరుల జీవితంగా కనిపిస్తుంది. తాను ఓ ముళ్ల కిరీటాన్నని, ఆ కిరీటాన్ని ఏసుక్రీస్తులా తన అన్నగారు జీవితాంతం మోసారని కాళోజీ నారాయణరావు అనటం ఆయన నిజాయితీకి నిదర్శనం. ``ఎన్నేండ్లు వచ్చినను చిన్నవాడనటంచు అతి గారాబము తోడ అన్ని సమకూర్చుచు ఆటపాటల కెంతో అవకాశమిచ్చిన అన్నయ్య'' అంటూ కాళోజీ రామేశ్వరరావుకు నాగొడవ కవితా సంపుటిని అంకితమిస్తూ ప్రజాకవి అన్నమాటలు అక్షర సత్యాలు. ఆయన ఏనాడూ కుటుంబ బాధ్యతలను స్వీకరించేలేదు. పాటించలేదు. తన కుటుంబాన్ని, తము్మడి కుటుంబాన్ని అంతా తానే అయి నడిపించినవాడు అన్నయ్యే. రామేశ్వర రావు కూడా మంచి కవి. ఉర్దూలో మనవాడని చెప్పుకోదగిన కవి రామేశ్వరరావు ఒక్కరు. తము్మడ్ని స్వేచ్ఛగా వదిలిపెట్టిన కారణంగానే కాళోజీ ప్రజా ఉద్యమాల్లో కీలకంగా, క్రియాశీలంగా పాల్గొనేందుకు అవకాశం లభించింది.
కాళోజీ పూర్వీకులు మహారాష్ట్ర ప్రాంతం నుంచి వరంగల్లు జిల్లా మడికొండ ప్రాంతానికి వలస వచ్చింది. ఆయన తల్లి మరాఠీలో జాతీయోద్యమ నాయకుల కథలను అద్భుతంగా చెప్పేది. వాటన్నింటిలోనూ మహారాష్ట్ర నుంచి స్వాతంత్య్రోద్యమంలో అత్యంత సాహసోపేతంగా పాల్గొన్న వీర సావర్కర్‌ గాథలను, స్వాతంత్య్రం నా జన్మహక్కు అని బ్రిటిష్‌ వారి గుండెలదిరేలా నినదించిన లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ గాథలు తనను ఎంతో ప్రేరేపించినవని కాళోజీ ఎన్నో వేదికలపై బహిరంగంగా చెప్పారు. వివిధ ఇంటర్వూ్యలలో కూడా దీని ప్రస్తావన ఉంది. కుటుంబం నేపథ్యం మహారాష్ట్ర కావటం వల్ల మరాఠా యోధుల ప్రేరణ కాళోజీ కుటుంబంపై తీవ్రంగానే ఉందని చెప్పవచ్చు. బాలగంగాధర్‌ తిలక్‌ ఇచ్చిన పిలుపు మేరకు జాతీయోద్యమంలో భాగంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను విద్యార్థి దశలో కాళోజీ ఘనంగా నిర్వహించారు. గణపతి ఉత్సవాలను నిర్వహించి ప్రభుత్వానికి విరుద్ధంగా ఊరేగింపులు నిర్వహించేవారు. ఈ ఊరేగింపుపై ఒకసారి ముస్లిం మతోన్మాదులు చేసిన దాడిలో కాళోజీ గాయపడ్డారు కూడా. కాళోజీ జీవితంలో ముఖ్యమైన సందర్భం ఆర్యసమాజ్‌ కార్యక్రమాల్లో పాల్గొనటం. 1920లలోనే ఆయన ఆర్యసమాజ్‌ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆర్యసమాజ్‌ పద్ధతిలో యజ్ఞం కూడా నిర్వహించారు. ఆనాటి కాలం హైదరాబాద్‌ సంస్థానంలో అత్యంత దుర్భరమైన కాలం. తెలుగు అంటే ఉర్దూకు వ్యతిరేకం. ఉర్దూకు వ్యతిరేకం కాబట్టి అది ఇస్లాం మతానికే వ్యతిరేకం.. అంటే అంతిమంగా ఇస్లాంకు చెందిన రాజుకు వ్యతిరేకం అనే దురభిప్రాయాన్ని ప్రచారం చేసి ముస్లిం మతోన్మాదులు దాష్టీకం చేసిన రోజులవి. ముస్లింలు కాని వాళ్లందరినీ నిజాం రాజుకు ద్రోహులుగా సందేహించే రోజుల్లో కాళోజీ ఆర్యసమాజాన్ని ఆసరా చేసుకుని ప్రజా ఉద్యమబాటలో ముందు కురికాడు. ఓ పక్క నిరంకుశ ఇస్లాం రాజ్యం, మరోపక్క గ్రామాల్లో పెత్తందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల దురాగతాలు..వీటన్నింటి నడుమ బలవంతపు మతమార్పిళు్ల అన్నీ కలిసి తెలుగువారి పరిస్థితి దుర్భరంగా ఉండేది. ఈ వాతావరణంలో నాడు ఆర్యసమాజం నిర్వహించిన భూమిక అనిర్వచనీయమైనది. బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చిన వారినందరికీ ఆర్యసమాజం శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలోకి మార్చటం ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం. కాళోజీ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేసిందీ ఉద్యమం. నాటి నిజాం మత దురహంకారానికి వ్యతిరేకంగా కాళోజీ పోరాడాడు. ఆ తరువాత ఆంగ్లేయుల వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమంలో కీలక భూమిక నిర్వహించిన గ్రంథాలయోద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నాడు. ప్రజలను చైతన్యపరచి, బ్రిటిష్‌, నిజాం వారి ప్రజా వ్యతిరేక చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధపరచటమే లక్ష్యంగా కాళోజీ ఆ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.
ఆయన దేన్నీ తిరస్కరించలేదు. అలాగే దేన్నీ అక్కున చేర్చుకోలేదు. ప్రాచీన భారతీయ సంప్రదాయం నుంచి ఆధునిక వామపక్ష సంప్రదాయం దాకా, సనాతన ధర్మం నుంచి, మావో సిద్ధాంతం దాకా అన్నింటినీ చదివాడు.. అవగాహన చేసుకున్నాడు.. వాటిలోని మంచిని స్వీకరించాడు.. చెడును నిష్ఠురంగా తిరస్కరించాడు. తాను చేసిందే తన హితులకు చెప్పాడు. ప్రతిద్వంద్వులకూ అదే చెప్పాడు. ఆర్యసమాజం నుంచి పౌరహక్కుల ఉద్యమం దాకా అన్నింటా పాల్గొన్నాడు. అందరికీ ఆప్తుడయ్యాడు. కానీ తామరాకు మీద నీటిబొట్టులా దేన్నీ అంటిపెట్టుకుని ఉండలేదు. నిజాం రాజ్యంలో ప్రజల హక్కులకు భంగం కలిగితే నిరసించిన గళం, ప్రజాస్వామ్య స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా అదే పరిస్థితి నెలకొంటే మరింత తీవ్రంగా నిరసించింది. ఎవరి సిద్ధాంతం వారిదే. ఒకరి సిద్ధాంతంతో అంతా ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఏకీభవించకపోతే పీక నొక్కేస్తామంటేనే సమస్య. దీన్నే ఫాసిజం అని కాళోజీ స్పష్టంగా చెప్పాడు. ఇందుకోసం ఆయన పౌరాణిక గాథ అయిన ప్రహ్లాద చరిత్రను ఉదాహరణగా చూపడం విశేషం. ఇందిరాగాంధీ భారత దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కాళోజీనారాయణరావు చేసిన గొప్ప పని ప్రహ్లాద చరిత్రను పఠిస్తూ ఆంధ్రదేశమంతటా పర్యటించటం. `హిరణ్యకశిపుడు ఫాసిస్టు. వానిది రాజ్యహింస. ప్రహ్లాదుడు సత్యాగ్రహి. సత్యాగ్రహం ఫలితం ఇవ్వలేదు. నరసింహుడు ప్రతిహింస చేయవలసి వచ్చింది.'' ఇది ప్రహ్లాద చరిత్రకు ఆయన చేసిన వ్యాఖ్యానం. ఆయన వ్యక్తిత్వాన్ని, ఉద్యమ జీవితాన్ని వేరు చేసి చూడటం సాధ్యం కాదు. పైకి ఒకలాగా, లోపల మరోలాగ ఉండటం ఆయనకు సాధ్యం కాదు. ప్రభుత్వం ప్రజలను హింసిస్తోందని, తుపాకి గొట్టం ద్వారా ప్రజారాజ్యం తీసుకురావాలని మావోయిస్టులుగా మారిన నక్సలైట్లు పోరాటం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల పదఘట్టనల మధ్య నలిగిన పేద ప్రజానీకాన్ని ఉద్ధరించడం కోసం వారికి భూమిని ఇప్పించటం కోసం, వారికి భుక్తి కల్పించటం కోసం, దొరల గడిల నుంచి వారికి విముక్తిని కల్పించటం కోసం నక్సలైట్లు మూడున్నర దశాబ్దాలుగా సాగించిన ఉద్యమాన్ని ఆయన సమర్థించాడు. కాలం గడుస్తున్న కొద్దీ వాళు్ల పక్కదారి పట్టినప్పుడు హెచ్చరించాడు. వారి తొందరపాటు చర్యలను, నిర్ణయాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. అంతేకానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఆయన తిరస్కరించలేదు. వ్యవస్థ ఏదైనా సరే, సామాన్యుడికి అన్యాయం చేయరాదన్నదే ఆయన సిద్ధాంతంగా కొనసాగింది. మొత్తం వ్యవస్థనే మార్చాలన్నది ఆయన ఉద్దేశం కాదు. వ్యవస్థలో లోపాలను సరిదిద్ది ప్రజలకు అవినీతి రహిత రాజ్యాన్ని అందించాలనే చివరికంటా కోరుకున్నాడు. తమ మాట వినక పోతే అమాయక గిరిజనులనైనా కిరాతకంగా హతమార్చడాన్ని ఆయన ఎంతమాత్రం సమర్థించలేదు.
1947 ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, హైదరాబాద్‌ సంస్థానం స్వేచ్ఛావాయువులు పీల్చడానికి మరో ఏడాది పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన గుల్బర్గా జైలులోనే గడపాల్సి వచ్చింది. హైదరాబాద్‌ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుడు కాళోజీతో సహా అనేకులు ఆనాడు ఆ పరిణామాన్ని స్వాగతించినవారే. తెలుగువారంతా ఒక్కటిగా ఒకే రాష్ట్రంలో ఉంటే తెలంగాణంతో సహా అన్ని ప్రాంతాలకూ సమన్యాయం జరుగుతుందని అమాయకంగా విశ్వసించారు. పద్యాలు రాశారు. కానీ కొన్నాళ్లకే తెలిసింది, ఇదంతా బూటకమని, వేర్వేరు ప్రాంతాల తెలుగు ప్రజలు సమైక్యంగా ఉండటం సాధ్యం కాదని. అందుకే ఆంధ్రప్రదేశ్‌ అవతరణను ఆహ్వానించిన కాళోజీయే `భాష పేర సాలెగూడు భద్రమనకు' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మళ్లీ చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణ ప్రాంతాన్ని, భాషను, యాసను, సంస్కృతిని, నాగరకతను, పండుగలను, సారస్వతాన్ని కించపరిచే ప్రయత్నాలను కఠినంగా నిరసించాడు. ఆ తరువాత ఎన్నడూ ఆయన ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడుకలను జరుపుకోలేదంటే, ఒక అభిప్రాయానికి వస్తే కాళోజీ ఎంత కఠినంగా వ్యవహరిస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే ఒక ఉదాహరణ చెప్పాలి. ఒకానొక నవంబర్‌ ఒకటి సందర్భాన్ని పురస్కరించుకుని ఈనాడు దినపత్రికలో పెద్దల అభిప్రాయాలను ప్రోది చేసి ఒక ప్రత్యేక కథనం రాయాలనే తలంపుతో తాతగారి (కాళోజీని నేను తాతగారు అని పిలుస్తాను) దగ్గరకు వెళ్లాను. నక్కలగుట్టలోని ఆయన స్వగృహంలో మొక్కలకు నీళు్ల పోస్తూ వ్యవసాయం చేస్తున్నారాయన. ఆయన దగ్గరకు వెళ్లి నేను ఫలానావారి అబ్బాయిని.. ఈనాడులో పనిచేస్తున్నాను.. నవంబర్‌ ఒకటి సందర్భంగా మీ అభిప్రాయం ప్రచురిద్దామని వచ్చానని చెప్పా. ఆయన చాలా సౌమ్యంగా మనవడా అని దగ్గరకు తీసుకునేసరికి నేను చాలా సంబరపడ్డా. అప్పుడు ఆయన చెప్పింది వింటే విస్మయం కలుగుతుంది. ``ఆంధ్రప్రదేశ్‌ అవతరణ గురించి నేను చెప్పేదేం లేదు. ఒకవేళ నేనేం చెప్పినా అది మీ పత్రికలో ప్రచురణ జరగదు. ఉన్నదున్నట్లు రాసినా, మీ రామోజీరావు వేసుకోడు.. అయినా సెప్టెంబర్‌ పదిహేడున హైదరాబాద్‌ విమోచన దినోత్సవం జరపని ప్రభుత్వానికి నవంబర్‌ ఒకటిన వేడుకలు జరిపే హక్కు ఎక్కడిది?'' అని విస్పష్టంగా వెల్లడించాడు. ఒకరిపై వారు ఎంతటి వారైనా నిర్మొహమాటంగా అభిప్రాయాలను వెల్లడించటంలో కాళోజీ ఎంతటి వారో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎంత కఠిన హృదయుడో అంత నిజాయితీపరుడు. తాను ఒకటి చేయడానికైనా, చెప్పటానికైనా ఒప్పుకుంటే బ్రహ్మరుద్రాదులు అడ్డం వచ్చినా వెనక్కి తగ్గరు. ఇందుకు ఉదాహరణ కూడా ఈనాడుతో ముడిపడిందే. ఈనాడు టెలివిజన్‌ ప్రారంభించిన తొలినాళ్లలో ప్రముఖుల జీవితాలు, వారి అభిప్రాయాలతో ప్రత్యేక కార్యక్రమాలను కొంతకాలం ప్రసారం చేసారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా ఓ విలేఖరి (అరుణారవికుమార్‌), కెమెరా బృందం వరంగల్‌ వచ్చింది. వారికి కాళోజీని పరిచయం చేసేందుకు తోడుగా నేను వెళ్లాను. ఇంతకు ముందు ఈనాడును తిరస్కరించిన కాళోజీయే, ఇంటర్వూ్య ఇవ్వమనగానే కాదనకుండా ముందుకు వచ్చారు.
ఆయన ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో ఓ చిన్న వేదిక మాదిరిగా ఉన్న బండ వద్ద కూర్చొని ఆయన మాట్లాడుతున్నారు. దాదాపు అరగంటకు పైగా ఆయనతో ఇంటర్వూ్య జరిగింది. అంతా పూర్తయిన తరువాత ఇంటి ముందున్న అరుగుమీదకు వెళ్లి కూర్చొని కాళ్లపైన చేతులతో కాళోజీ రాసుకుంటున్నారు. అదేమిటని అడిగితే ఇంటర్వూ్య జరిగిన ప్రదేశంలో ఎర్ర చీమలు ఆయన కాళ్లను విపరీతంగా కుట్టాయి. కాళు్ల ఎర్రబారాయి. ఈ సన్నివేశం చూసి ఈటీవి బృందం అవాక్కయింది. ముందే చెప్తే ఇంటర్వూ్య ఆపేసి వేరే చోట చేసేవాళ్లం కదా అని ఆందోళన చెందింది. కానీ, ఆయన మాత్రం చిరునవు్వ నవ్వి పరవాలేదు.. మీకు మాత్రం ఇబ్బంది కలిగించటం ఎందుకని నేను మధ్యలో ఆపలేదు అన్నారు. కాళోజీ అన్న ఈ మాటలకు ఏమని వ్యాఖ్యానం చేసేది? ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆప్తుడని ఆయన అన్నాడు. నేనంటే తిరుగుబాటు దారు.. నాగొడవే తిరుగుబాటు అని నినదించాడు. మనం అన్యాయానికి సాక్షీభూతులుగా మనం ఉండరాదు. మన ఇళ్లను కొల్లగొట్టి, మన వాళ్లను చెరిచి, హతమార్చిన వాళ్లను వెంటాడి, వేటాడాలన్నాడు. తరిమి తరిమి కొట్టాలన్నాడు.
అన్యాయాన్నెదిరిస్తే
నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే
నా గొడవకు ముక్తి ప్రాప్తి
అన్యాయాన్నెదిరించిన వాడు
నాకు ఆరాధ్యుడు.
ఇందులో ఇజాల మాట లేదు. సిద్ధాంతాల మాట అంతకన్నా లేదు. వ్యవస్థల జోలి లేదు. ఉద్యమాల ఊసు అంతకన్నా లేదు. కాళోజీ ఈ మాటలు అన్ని సిద్ధాంతాల వారికీ, అన్ని ఉద్యమాల నాయకులకూ , పాలక వర్గానికీ, పాలిత వర్గానికీ అందరికీ ఆచరణీయంగా వర్తిస్తుంది. `పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది' అని జయప్రకాష్‌ నారాయణ్‌ మరణించినప్పుడు అన్న కాళోజీని ఏమని పొగిడేది? ఏమని వివరించేది?

1 కామెంట్‌:

Uyyaala చెప్పారు...

తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం ఎప్పటికి అంతరిస్తుందో.... కాళోజీ ఆత్మ ఎన్నడు శాంతిస్తుందో ...!

మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన వాడైనా తెలంగాణాకు ప్రతీక గా మారాడు. తెలంగాణా కు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేదుకు, తెలంగాణా ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు తన జీవిత మంతా కృషి చేసాడు కాళోజీ.

ఆంధ్రా నుంచి వలస వచ్చి తెలంగాణా లో సెటిల్ అయిన వాళ్ళు అందరూ కూడా కాళోజీ ని స్ఫూర్తిగా తీసుకుని - తమకు అన్నం పెడుతున్న ఈ ప్రాంతంతో మమేకమైతే ఎంత బావుంటుంది.
ఈ మట్టి లోనే పుట్టి ఈ మట్టిలోనే కలసి పోబోతున్నప్పుడు ఈ ప్రాంతంతో మమేకం కాకపోవడం న్యాయం కాదు కదా.

రజాకార్లకు , నిజాము నవాబుకు, దొరలకు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం లో అసువులు బాసిన వేలాది మంది అమర వీరులకు ప్రభుత్వం గుర్తించదు ... కానీ తమ విముక్తికి పొట్టి శ్రీరాములే కారనమన్నట్టు భావించి తెలంగాణా ప్రజలు బలవంతం గా శ్రద్ధాంజలి ఘటించాలని కోరుకుంటుంది. ఎంత విషాదం.

కాళోజీ గురించి చాలా స్ఫూర్తి దాయకమైన విషయాలు తెలిపారు.