26, జులై 2009, ఆదివారం

నినదించాల్సిన తరుణం....ఒక్కటవ్వాల్సిన అవసరం

`జాతీయ గీతాన్ని పాడే కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.' అని రాసుకోవాల్సిన దుస్థితి బహుశా ఏ దేశానికీ, ఏ జాతికీ కలిగి ఉండదు. ఇలాంటి సన్నివేశం ప్రపంచంలో భారత దేశంలో తప్ప మరెక్కడా కనిపించదు. స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో ఉవ్వెత్తున ఎగసి, ప్రజల కణం కణంలో ఉత్తేజాన్ని నింపిన ఒక మహత్తరమైన నినాదానికి పట్టిన దుర్గతి ఇది. జాతీయతా భావానికి ప్రతీకాత్మకంగా వందేళ్లకు పైగా వర్ధిల్లుతున్న వందేమాతరం గీతం కూడా ఈ దేశంలో ఓటు బ్యాంకు రాజకీయానికి బలికావడం కంటే దురదృష్టం ఇంకేముంటుంది?

వందేమాతర ఉద్యమానికి వందేళు్ల పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆ మహత్తరమైన నినాదాన్ని నినదించే కార్యక్రమం చాలా సార్లు అడ్డుకున్నారు. దానికి మతం రంగు పూసారు. మాస్‌‌క వేశారు. ఎన్నో అన్నారు. మరెన్నో చేశారు. ఎవరు ఎన్ని వివాదాలు సృష్టించినా ఇవాళ్టికీ వందేమాతరం ఆగలేదు. పాఠశాలలు, ప్రభుత్వ, సాంస్కృతిక సంస్థలన్నింటిలోనూ వందేమాతరం గేయం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఈ గీతం పాడుతుంటేనే ఒక ఉత్సాహం, ఉద్వేగం.. ఉద్రేకం ఉప్పొంగుతూ వస్తాయి. . కొన్ని చోట్ల తొలి రెండు చరణాలనే పాడినప్పటికీ, ఎక్కువ ప్రాంతాల్లో పూర్తి గీతాన్ని ఉద్వేగంతో పాడుకోవడం విశేషం. వివాదం ఎంతగా రగుల్కొల్పినప్పటికీ, ముస్లిం వరా్గల్లో కొన్ని దూరంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నింటిలోనూ భేదభావాలకు అతీతంగా వందేమాతరాన్ని ఆలపిస్తుండటం ఆ గీతంలో ఇప్పటికీ ఉన్న అసాధారణమైన ప్రేరణ శక్తికి నిదర్శనం. వందేమాతరాన్ని ముస్లిం, మైనారిటీ సంస్థలు నిర్ద్వంద్వంగా తిరస్కరించేశాయి. వందేళ్ల వందేమాతరం వార్షికోత్సవం సందర్భంగా ఏకంగా తమ విద్యాసంస్థలకు, మదరసాలకు సెలవులు ప్రకటించేసుకున్నాయి.
దేశంలో వందేమాతరం పాడేందుకు తొలుత అభ్యంతరం చెప్పింది భారత దేశ ముస్లింలకు ప్రవక్తనని తనను తాను భావించుకునే జామా మసీద్‌ ఇమామ్‌ సయ్యద్‌ బుఖారీ అయితే, గీతాన్ని పాడటం ఐచ్ఛికం చేసి వివాదాస్పదం చేసింది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు గతంలో మంత్రిగా వెలగబెట్టిన అర్జున్‌ సింగ్‌ దొరవారు. అర్జున్‌ సింగ్‌ తానే ఒక వివాదం. ఆయన మాట్లాడే ప్రతిమాటా ఇటీవలి కాలంలో వివాదం కాకుండా ఉండలేదు. ఎన్నికల్లో ఒబిసిలు, ముస్లింల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు చేస్తున్న సంతుష్టీకరణ రాజకీయాలకు పరాకాష్ట జాతీయ గీతాలాపనను ఐచ్ఛికం చేయడం. వందేమాతరం గేయంపై యాభై ఏళ్ల క్రితమే వివాదాలు రేగడం, సమసిపోవడం కూడా జరిగిపోయింది. ఈ గేయంలోని తొలి రెండు చరణాలను ఎలాంటి ఆక్షేపణలకు తావు లేకుండా దేశ పౌరులంతా పాడాలని ప్రభుత్వమే నిర్ణయించింది. ఈ విషయంలో మరో ఆలోచనకు తావే లేదు. నాటి నుంచి నేటి వరకు పార్లమెంటు సహా అన్ని ప్రభుత్వ సంస్థల్లో, సమావేశాల్లో, పాఠశాలల్లో తొలి రెండు చరణాలను పాడుతూనే ఉన్నారు. భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని సంగీతకారుడు రహమాన్‌ వందేమాతరాన్ని విశ్వవ్యాప్తం చేశారు. విదేశీయులైన నెల్సన్‌ మండేలా, యాసర్‌ అరాఫత్‌ వంటివారు వందేమాతరాన్ని నినదించి స్ఫూర్తిని పొందారు. బుఖారీలకు, అర్జున్‌సింగ్‌లు తమ అవసరార్థం పనిచేసే బాపతు నేతలు... ఓటు రాజకీయాల కోసమో, మరో ప్రయోజనం కోసమో, దేశ అస్తిత్వాన్ని పణంగా పెట్టడం కాదా ఇది? దేశ ప్రధాన స్రవంతిలో ముస్లింలను భాగస్వాములను చేయకుండా... వేరు చేసే అత్యంత కుటిలమైన రాజనీతి దీని వెనుక దాగి ఉంది. ఇలాంటి కుహనా చర్యల వల్ల దేశాన్ని ఇప్పటికే టెరర్రిజం పట్టి పీడిస్తున్నది. బ్రిటిష్‌ వారి డివైడ్‌ అండ్‌ రూల్‌ పాలసీకీ, ఇప్పుడున్న పరిపాలకుల రాజనీతికి ఇక ఏం తేడా ఉన్నది?
సెక్యులరిజం రాజకీయాల పుణ్యమా అభంశుభం తెలియని అమాయక విద్యార్థులలో విషబీజాలు నాటినట్లయింది. వందేమాతరం గేయాన్ని బంకించంద్రుడు ఆయన ఢాకా నవాబుకు వ్యతిరేకంగా రాశాడని, దాన్ని హిందూ సన్యాసులు పాడారు కాబట్టి అది ఇస్లాముకు వ్యతిరేకమని వాదించడం అర్థం లేనిది. చివరి మూడు చరణాల్లో ఉన్న విగ్రహారాధన కొందరికి అభ్యంతరం కాబట్టే, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ కూడా తొలి రెండు చరణాలనే పాడుతున్నారు. ఈతరం వారిలో చాలా మందికి వందేమాతరంలో మరో మూడు చరణాలు ఉన్నాయన్న సంగతే తెలియదు. ఈ గీతాన్ని రచించడంలో రచయిత ఉద్దేశం ఏమైనప్పటికీ, అది భారత జాతిలో రేకెత్తించిన జాతీయ భావన అసాధారణమైనది. కేవలం రెండు పదాల నినాదం బ్రిటిష్‌వారి గుండెల్లో రైళు్ల పరిగెత్తించింది. వందేమాతరం అనడమే రాజద్రోహంగా పరిగణించిన రోజులవి. ఈ ఒక్క నినాదంపై జాతి యావత్తూ ఏకత్రితం అయిందంటే ఒక జాతీయ గీతానికి ఇంతకంటే కావలసిన అర్హత ఏమిటి? అర్థం లేని అభూత కల్పనలతో లేని వివాదాన్ని సృష్టించడం దేశ సమైక్యతకు తీరని విఘాతాన్ని కల్గిస్తుందన్న కఠిన సత్యాన్ని వివాద సృష్టికర్తలు గ్రహించకపోవడం దురదృష్టం. విభజించి పాలించు సూత్రంపై బ్రిటిష్‌వారు బెంగాల్‌ విభజనకు పూనుకోవడం వల్లనే నూరేళ్ల క్రితం వందేమాతరం ఉద్యమం వచ్చిందన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించాలి. ఈ దేశం అంతా మనదేననే బలమైన భావనను కులమతరాజకీయాలకు అతీతంగా ప్రజలందరిలో బలంగా పెంపొందించగలిగితే దేశం అభివృద్ధి కోసం పరిపాలకులు ఎలాంటి పథకాలు వేయనక్కరలేదు. పార్లమెంటులో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకున్నా, దేశం పురోగతి వేగాన్ని అడ్డుకోలేరు. మతప్రాంతాలకు అతీతంగా దేశాన్ని ఒక్కటయిన తరువాత సమస్యలు దూదిపింజల్లా సమసిపోతాయి.

2 కామెంట్‌లు:

Raj చెప్పారు...

బాగుంది.

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.