31, జులై 2009, శుక్రవారం

జమాయిత్‌ ఏ ఇస్లామీతో భారతీయ జనతాపార్టీకి పోలికా....!?

గురువారం రాత్రి సిఎన్‌ఎన్‌ ఐబిఎన్‌ చానల్‌లో ఓ చర్చాకార్యక్రమం వాడిగా వేడిగా జరిగింది. పాకిస్తాన్‌ విషయంలో ప్రధాన జాతీయ పార్టీలైన భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం ఈ చర్చలో ప్రధానాంశం. పాకిస్తాన్‌తో చర్చల విషయంలో కైరోలో ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ పాకిస్తాన్‌ ప్రధానమంత్రి గిలానీతో అనూహ్యంగా సానుకూలంగా స్పందించటం రెండు రోజులుగా పార్లమెంటును కుదిపేస్తోంది. పైగా బలూచిస్తాన్‌ను చర్చల్లో అంశంగా చేర్చాలన్న దానికి ఒప్పుకోవటం గమ్మతె్తైన వింత... దీనిపై చర్చించమని సోకాల్‌‌డ మేదావులనుకునే విశ్లేషకులను సదరు చానల్‌ పిలిస్తే.. ఆ విశ్లేషకులు దేశానికి సంబంధించిన కీలక విషయాన్ని వదిలిపెట్టి, ఓ కుహనా రాజకీయ వేత్తగా మారి పాకిస్తాన్‌లో అతివాద చాందస సంస్థ, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న ఓ ముష్కర మూక జమాయితే ఇస్లామీతో దేశంలోని ఓ జాతీయ రాజకీయ పార్టీని పోల్చటం విస్మయానికి గురి చేసింది. ఈ మాట అనగానే నన్ను బిజెపి మనిషని కొందరు భ్రమ పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. దేశ రాజకీయాల్లో బిజెపి తన సిద్ధాంత పరంగానో, మరో మరో కారణాల చేతనైనా భారత రాజ్యాంగ నిబంధనల పరిధిలో, పరిమితుల్లో రాజకీయాలు చేస్తున్న జాతీయ స్థాయి పార్టీ. ఆరేళ్ల పాటు దేశంలో అధికారాన్ని నిర్వహించిన పార్టీ. పార్లమెంటులో వందకు పైగా స్థానాలు గెలుచుకున్న పార్టీ. అలాంటి ఓ రాజకీయ పార్టీని ఓ చాందసవాద సంస్థతో పోల్చటం ఈ దేశ పౌరులంతా ఆక్షేపించాల్సిన విషయం. ఈ విధంగా అడ్డగోలుగా మాట్లాడి, దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన కీలక విషయాన్ని పక్కదారి పట్టించే మేధావుల వల్లనే దేశం ఇన్ని రకాలుగా సతమతమవుతోంది. ఒక అడుగు ముందుకేస్తే.. రెండడుగులు వెనక్కి వేస్తోంది. దీనిపై భారతీయులంతా సమష్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది. మనకెందుకులే అనుకున్నంతకాలం దేశం మూల్యాన్ని చెల్లించుకోవలసి ఉంటుంది. ఈ దేశం నాది అన్న భావన ప్రతి ఒక్కరిలో కలిగేలా స్పందించాలని మనవి....
ఇక మూలాల్లోకి వెళ్తే.....

పాకిస్తాన్‌తో మన వైరం 1946 నుంచే మొదలైంది. కాంగ్రెస్‌లో ఒకనాడు అచంచల దేశభక్తుడిగా మెలిగిన మహమ్మద్‌ అలీ జిన్నా పుర్రెను ఏ క్షణాన ఏ పురుగు తొలిచిందో కానీ, దేశాన్ని విచ్ఛిన్నం చేశాడు. కాశ్మీర్‌ను రావణ కాష్టంగా మండించిపోయాడు. దేశ విముక్తికి మేమే కారణమని భాజాభజంత్రీలు వాయించుకునే మహానుభావులంతా గుడ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. 62ఏళ్లయింది. మన మహానుభావుల బాటలో వారి వారసులు దారి తప్పకుండా నడుస్తున్నారు. వీరికి సమాంతరంగా అధికారానికి దారి ఏర్పరుచుకున్న మిగతా పక్షాల వారూ వారసుల పక్కనే సమాంతరంగా నడుస్తున్నారే తప్ప కొత్తదారిలో ముందుకుపోయేవాళు్ల ఎవరూ లేరు... పార్లమెంటులో మాత్రం అవకాశం వస్తే మాత్రం కొట్టుకుంటుంటారు. వారికి అలా చేయటం వినోదం... జనానికి ప్రాణసంకటం...
62 సంవత్సరాలు గడిచిపోయాయి. కాశ్మీర్‌ సమస్యను పరిష్కరిస్తానని అన్ని పార్టీలూ గొప్పలు చెప్పి అధికారాన్ని అనుభవించినవే... ఒక విధంగా చెప్పాలంటే దేశంలోని అన్ని పార్టీలూ... ప్రాంతీయ పార్టీలతో సహా అన్నీ కేంద్రంలో ఎంతో కొంతకాలం అధికారాన్ని వాసన చూసినవే ఉన్నాయి. కాశ్మీర్‌లో ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన పాపం ఇవాళ దేశం మొత్తాన్ని దహించివేస్తున్నది. పాకిస్తాన్‌ పట్ల కేంద్రంలోని ప్రభుత్వాలు ఎప్పుడూ సరైన అంచనాతో, సరైన విధానాన్ని అనుసరించిన దాఖలా లేదు. ఈ విషయంలో అటల్‌ బిహారీ వాజపేయి అయినా, మన్మోహన్‌సింగ్‌ అయినా వేరు కాదు..
పాక్‌ ఉగ్రవాదులు మన విమానాన్ని హైజాక్‌ చేసి తాలిబన్‌ గడ్డపైకి తీసుకువెళ్తే... మన విదేశాంగమంత్రి జస్వంత్‌ సింగ్‌ స్వయంగా వెళ్లి వారి డిమాండ్లను నెరవేర్చి మరీ వచ్చారు. తరువాత కాశ్మీర్‌ అసెంబ్లీపై దాడి జరిగింది. ఏకంగా పార్లమెంటునే ముట్టడించటానికి ముష్కరులు ప్రయత్నించారు. కార్గిల్‌లోకి చొరబడి పూర్తిగా స్థిరపడి పాకిస్తాన్‌ సైన్యం మనపై యుద్ధానికి సన్నద్ధమైన తరువాత కానీ, నాటి సర్కారుకు కళు్ల తెరుచుకోలేదు. అపారమైన ప్రతిభాపాటవాలతో మనసైన్యం సాధించిన విజయం ఫోటోను చూపించుకుని నాడు బిజెపి రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఇక అటల్జీ పోచికోలు కబుర్లకు(మూ్యజింగ్‌‌స అని ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు) కొదవే లేదు. లాహోర్‌కు బస్సు యాత్ర చేస్తారు. ముషారఫ్‌ను పిలిచి ఆగ్రాలో చర్చలు జరుపుతారు.. మన కార్యదర్శిని ఇస్లామాబాద్‌కు పంపించి చర్చలు జరిపిస్తారు..
ఇక మన్మోహన్‌జీకి ఉన్నది మరింత ఔదార్యం.... ఊహించరాని ఔదార్యమది. గత హయాంలో అంటే ఆయన అధికారంలో ఉన్న మొదటి అయిదేళ్లలో జరిగినన్ని ఉగ్రవాద ఘటనలు అంతకుముందు 55ఏళ్లలో ఎన్నడూ జరగలేదు. దాదాపు నెలకొకటిగా జరుగుతూ వచ్చాయి. అంతేకాదు.. దేశంలోని అన్ని రాషా్టల్రకూ ఉగ్రవాదులు విస్తరించారు. అక్కడా, ఇక్కడా అని కాకుండా ఎక్కడపడితే అక్కడ, ఎలా పడితే అలా సామూహిక జనహననానికి పాల్పడ్డారు. అన్నింటికీ మించి నిఘా వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా ఉందని విశ్వసించే నౌకాదళాన్ని కన్నుగప్పి సముద్రమార్గం గుండా దేశంలోకి చొరబడి దేశ వాణిజ్యరాజధానిని స్మశాన వాటికగా మార్చే మహా దారుణ యత్నానికి ఉగ్రవాదులు పాల్పడటం మహోపద్రవానికి సంకేతం. 260 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ వాడు ఇదే సముద్రమార్గం ద్వారా దేశంలోకి వచ్చి మనల్ని బానిసల్ని చేశాడు. ఇప్పుడు పాక్‌ ముష్కరులు అదే దారిని ఎంచుకున్నారు. మనం చేష్టలుడిగి చూస్తూ కూర్చున్నాం. ఎప్పటిలాగే కొంతకాలం పాక్‌పై మన పాలకుల ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఇక పాక్‌తో మాట్లాడేదే లేదన్నారు. ఉన్నట్టుండి... పాక్‌తో చర్చించటానికి పిఎం ఒకె అన్నారు. అది కూడా ఉగ్రవాదం ఊసు లేకుండా... ఇంకా గమ్మత్తేమిటంటే.. ఎక్కడో బలూచిస్తాన్‌లో టెరర్రిజం సమస్య తమను వేధిస్తోందని, దీనికి కారణం భారతేనని పాక్‌ ప్రధానిగారు సింగ్‌జీ వద్ద వాపోయారట...తూచ్‌... బలూచిస్తాన్‌లో సమస్య ఉంటే మాకేం సంబంధం.. కావాలంటే మీ ఆరోపణలపై చర్చించటానికి మేం రెడీ అని ఒప్పేసుకుని, ఓ సంయుక్త ప్రకటనపై సంతకం చేసేసి మరీ కైరో నుంచి ఇంటికి వచ్చారు సింగ్‌ గారు..
ఇదంతా ఒక ఉగ్రవాద ఘటనకు, మరో ఉగ్రవాద ఘటనకు మధ్య ఎప్పుడూ జరిగే తంతు అనుకుంటే ఏం ప్రమాదం లేదు.. ఎందుకంటే... ఒక బాంబు పేలుడో.. ఒక టెరర్రిస్టు దాడో జరగ్గానే పాక్‌పై నిప్పులు చెరగడం... ఇది పిరికిపందల చర్య అనో.. దేశమంతా సంయమనం పాటించాలనో... ఇలాంటి వాటికి భయపడేది ఎంతమాత్రం లేదనో ఉపన్యాసాలు చేసేస్తారు... ఉగ్రవాదాన్ని కఠినంగా అణచేసేంతవరకూ పాకిస్తాన్‌తో చర్చలు జరిపేదే లేదంటారు.. మీరే చేశారంటూ సాక్ష్యాలు పంపిస్తారు... పాకిస్తాన్‌ వాటిని చెత్తబుట్టలో పారేస్తుంది.. ఒకరిద్దరిని అరెస్టు చేసి పంచనక్షత్రాల హోటల్లో ఉంచి రెండురోజుల తరువాత విడుదల చేస్తుంది. నాలుగు రోజులు బాగానే ఉంటుంది. అయిదో రోజు మళ్లీ మొదలవుతుంది. ప్రధాని కుర్చీలో కూర్చున్న పెద్దమనిషికి కడుపులో ఏదో దేవినట్లవుతుంది. మరెవరో మళ్లీ సలహా ఇస్తారు.. అమెరికా లాబీ మెల్లిగా ఊదర మొదలు పెడుతుంది. అంతే...పాకిస్తాన్‌తో మళ్లీ చర్చల ప్రక్రియ మొదలవుతుంది. ఆశావహం అంటారు.. సుహృద్భావపూరిత వాతావరణంలో చర్చిస్తామంటారు.. అన్నీ చర్చకు వస్తాయంటారు.. పరస్పర విశ్వాస చర్యలు చేపడ్తామంటారు.. ఇరు దేశాల మధ్య రాకపోకలు మొదలవుతాయి. ఇదంతా జరుగుతుండగానే మరో పేలుడు.. మళ్లీ చరిత్ర పునరావృతం...
అక్షరాలా ఇలాగే జరిగితే దొందు దొందే అనో.. అంతా ఒక తానుముక్కలే అనో ఓ నిట్టూర్పు విడిచి మరో పేలుడు ఎప్పుడు ఎలా జరుగుతుందా అని ఎదురుచూస్తూ ఉండేవాళ్లం అంతా... కానీ, సింగ్‌ గారి రూటే వేరు. కైరోలో ఆయన వెళ్లింది జి8 సమావేశంలో పాల్గొనేందుకు...సీతను చూసి రమ్మంటే.. లంకను కాల్చి వచ్చినట్లు.. మన సింగ్‌జీ కూడా అలాగే చేశారు. హఠాత్తుగా పాక్‌ ప్రధానితో సమావేశమయ్యారు. గతంలో ఎప్పుడూ కూడా పాకిస్తాన్‌తో ముందుగా నిర్ణయం కాకుండా ఎవరూ చర్చలు జరపలేదు. కానీ సింగ్‌ ఈజ్‌ కింగ్‌ కాబట్టి...ఆయన అన్నింటికీ అతీతుడు కాబట్టి.. ఆయనే సుప్రీం కాబట్టి గిలానీని పిలిపించుకుని అదే పనిగా చర్చలు జరిపారు. అసలు అజెండాలో లేని సమావేశాన్ని హడావుడిగా ఏర్పాటు చేయటానికి కారణం ఏమిటి? చర్చలు జరిపితే జరిపారు.. మన స్టాండ్‌ను బలంగా వినిపించాల్సిన బాధ్యత ప్రధానికి లేదా? కసబ్‌ లాంటి తీవ్రవాది ముంబయి దాడుల వ్యవహారంలో నేరం జరిగిన తీరును విస్పష్టంగా వెల్లడించిన తరువాత కూడా పాక్‌పై ఒత్తిడి పెంచడానికి జి8 సమావేశాల్లో గట్టిగా వాదించాల్సిన బాధ్యతను సింగ్‌ ఉద్దేశ్యపూర్వకంగానే విస్మరించినట్లుంది. గిలానీతో చర్చలకు సిద్ధంకావటమే కాకుండా ఈ చర్చల్లో ఉగ్రవాదం ప్రస్తావన రాదని మరీ హామీ ఇచ్చేశారు..పాక్‌ ఆరోపిస్తున్నట్లు బలూచిస్తాన్‌లో భారత్‌ పాత్రపై చర్చించటానికీ సై అన్నారు. ఇదేం విడ్డూరమో అర్థం కాదు...
ఓ పక్క ఉగ్రవాదుల పీచమణచేంత వరకూ పాక్‌తో చర్చించేది లేదంటూనే... చర్చిద్దామంటారు... ఇది ఎలాంటి విదేశాంగ విధానమో ఎంతటి మేధావులు బురల్రు బద్దలు కొట్టుకున్నా అర్థం కానిది.
తీరా ఢిల్లీకి వచ్చాక ఇదే పని చేశారు సింగ్‌ గారూ అని విపక్షాలు అడగటం వారి తప్పయింది. మీ హయాంలో మీరేదో చేశారు కనుకనా.. మమ్మల్ని అడుగుతారు అని ఎదురుదాడి చేశారు. వాళు్ల సరిగా చేయలేదనే కదా ఈయన్ను అందలమెక్కించింది... అలాంటప్పుడు ఈ ఎదురుదాడికి అర్థమేముంది? బలూచిస్తాన్‌లో మన తప్పేం లేనప్పుడు చర్చించటానికి భయపడాల్సిందేముంది అన్నది మన్మోహన్‌ సింగ్‌ వాదన. వాడెవడో అర్థం లేని ఆరోపణ చేస్తే... తగుదునమ్మా అని చర్చిద్దాం అంటే ఆయన్ను ఏమనాలి? ఈయన చేసిన పనికి పాకిస్తాన్‌లో మీడియా, రాజకీయ నేతలు తాము గొప్ప విజయం సాధించినట్లుగా చెప్పుకున్నాయంటేనే సింగ్‌ను గిలానీ ఎలా బోల్తా కొట్టించారో అర్థం చేసుకోవచ్చు. అసలు బలూచిస్తాన్‌కీ మనకు సంబంధం ఏమిటి? ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లిన భారతీయ బృందానికి అక్కడ సహాయ, పునరావాస కార్యక్రమాలు చేసేందుకు సమయం చాలటం లేదు... ఇక బలూచిస్తాన్‌కు వెళ్లి అక్కడ తాలిబన్లతో కుమ్మకై్క ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారట... ఎవరన్నా వింటే నవ్విపోతారు... తాలిబన్లకు తల్లీదండ్రీ పాకిస్తాన్‌ సైన్యం. ఐఎస్‌ఐ...ఇంత యుద్ధం జరిగిన తరువాత కూడా వారిని వాయవ్య ప్రాంతంలో అతిథి మర్యాదలతో అక్కున దాచిపెట్టుకున్నది పాకిస్తాన్‌... ప్రపంచపోలీసు కంటపడకుండా లాడెన్‌ను దాచి ఉంచింది పాకిస్తాను.. అలాంటి పాకిస్తాన్‌లో ఉగ్రవాదం చేయటానికి భారత్‌ నుంచి కుట్ర జరగాలా? ఇదేమని అడిగితే... ఇతర రాజకీయ పార్టీలపై అర్థం లేని అవాంఛనీయ ముద్ర వేస్తారా? దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయంలో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఏక అభిప్రాయంతో వ్యవహరించాలి. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇలాగే జరుగుతుంది. మన దేశంలో తప్ప. కసబ్‌ నేరాంగీకార ప్రకటనతోనే భారత్‌ పాకిస్తాన్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచాల్సి ఉండేది. అమెరికాను నిలదీయాల్సి ఉండేది. కానీ, అవన్నీ పక్కనపెట్టి ఆయుధ కొనుగోలు ఒప్పందాన్ని అది కూడా సిగ్గుతో తలదించుకునేలా అమెరికా ముందు మోకరిల్లేలా, తనిఖీలకు అంగీకరిస్తూ కుదుర్చుకున్నారు. ఈ పాలకుల వైఖరి ఏమిటన్నది అంతుపట్టకుండా తయారైంది. సింగ్‌ బృందం గిలానీకి లొంగిపోయిందా? ఒబామాకు తలూపుతోందా? దేశం ఏ దారిలో పోతున్నది... వీరు ఎక్కడికి తీసుకువెళు్తన్నారు?

2 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

అప్పుడెప్పుడో నెహ్రూగారు చేసారు ఇలాంటి పనే.మళ్ళీ ఆయన అడుగుజాడల్లో నడుద్దామనేమో సింగ్ గారూ అలాంటి పనే చేసారు.

Praveen Mandangi చెప్పారు...

బి.జె.పి. ఇండియాని పాకిస్తాన్ లా మత రాజ్యంగా మార్చాలనుకుంటోంది. 1980కి ముందు జన సంఘ్ అనే మతతత్వ పార్టీ ఉండేది. బి.జె.పి. తమ పార్టీ సిద్ధాంతాలూ, జన సంఘ్ సిద్ధాంతాలూ ఒకటేనని చెప్పుకుంటోంది. బి.జె.పి. అధికారంలో ఉన్నప్పుడు జన సంఘ్ కంటే పక్కాగా మత రాజకీయాలు నడిపింది. బి.జె.పి. గురించి తక్కువ అంచనా వెయ్యడం సరైనది కాదు.