29, జులై 2009, బుధవారం

గూటికి చేరుతున్న రాజకీయ పక్షులు


రోజంతా ఎక్కడెక్కడ తిరిగినా సాయంకాలానికి గూటికి తిరిగి చేరుకోవటం పక్షుల సహజ లక్షణం. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పక్షుల పరిస్థితీ అలాగే ఉన్నట్టుంది. తెలంగాణ పేరుతో, తెలంగాణ కోసమంటూ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన దేవేందర్‌గౌడ్‌ ఎక్కడా ఇమడలేక. అస్తిత్వాన్ని కాపాడుకోలేక మళ్లీ మాతృసంస్థవైపు చూస్తున్నారు.. బహిరంగంగా ఎలాంటి కామెంట్‌ చేయపోయినా, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి గౌడ్‌పై వస్తున్న వదంతులను ఖండించవచ్చు. మెగా బావగారి బావమరిది అల్లు అరవింద్‌ అర్జెంటుగా గౌడ్‌తో సమావేశమై రాజీ చేసే యత్నమూ చేయవచ్చు. కానీ, నిప్పులేందే పొగరాదు కదా....

నిజానికి తెలుగుదేశంలో దేవేందర్‌గౌడ్‌ ఒకనాడు విప్లవం. 1983లో తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనంలా అధికారంలోకి వచ్చినప్పుడు రాజకీయాలంటే తెలియని బిసిల్లో అసాధారణంగా వచ్చిన చైతన్యానికి గౌడ్‌ ప్రత్యక్ష నిదర్శనం. ఎన్టీరామారావుతోనే దేవేందర్‌ గౌడ్‌ రాజకీయ ప్రస్థానం మొదలైంది. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పని చేసిన దేవేందర్‌ సీనియర్‌ స్థాయికి ఎదగటానికి ఎంతోకాలం పట్టలేదు. తెలుగుదేశం పార్టీకి ఒక దశలో తెలంగాణలో పెద్ద దిక్కుగా మారారు. 1995లో చంద్రబాబు అధికారంలోకి రావటం వెనుకా దేవేందర్‌ పాత్ర చిన్నదేమీ కాదు. రామారావు ఆగ్రహానికి కడియం శ్రీహరి బలిపశువయితే, దాన్ని ఆసరా చేసుకుని చక్రం తిప్పిన చంద్రబాబుకు అన్ని విధాలా అండదండలిచ్చి పార్టీలో నెంబర్‌ 2గా ఎదిగారు. తరువాత విపక్షంలోకి వచ్చాక తెలంగాణ ప్రాంతంలో ఆయన నిర్వహించిన పాదయాత్రకూ మంచి స్పందన వచ్చింది. అక్కడి నుంచే తనను తాను ఎక్కువగా అంచనా వేసుకోవటం ప్రారంభించారు. పార్టీ అధినేతతో సమాన స్థాయిలో తన స్థాయిని భావించారు. పరిశీలకులూ ఆయన్ను అదేవిధంగా చూడటం మొదలు పెట్టారు. నిజంగా ఆయన పార్టీ ని వీడితే తెలంగాణలో ఆయన స్థాయిలో బిసి నేతను సమీకరించుకోవటం సాధ్యమేనా? అన్న అనుమానమూ తీవ్రంగా చర్చ జరిగింది. ఓ పక్క తెలంగాణ ఉద్యమం, మరో పక్క దేవేందర్‌ ఎదురుదాడితో బాబు ఉక్కిరిబిక్కిరయిన మాట వాస్తవమే. శ్రుతి మించిన ధీమాతో దేవేందర్‌ పార్టీని విడిచిపెట్టి సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆయన పెట్టుకున్న నవతెలంగాణ పార్టీ ఆయన కోరుకున్న తెలంగాణ కోసం ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. ఆయన వెంట తనవారనుకున్న ఏ ఒక్కరు కూడా నడచిరాలేదు. రాజకీయ పార్టీని నిర్వహించే ఆర్థిక, హార్థిక సామర్థ్యం లేక నెలల వ్యవధిలోనే దేవేందర్‌ చేతులెత్తేశారు. అటు తనతో సమానమైన కెసిఆర్‌తో కలపడానికి దేవేందర్‌కు చేతులు రాలేదు. ఇక మిగిలిన ప్రత్యామ్నాయం పిఆర్‌పి. మారు ఆలోచించకుండా పోయి చిరంజీవితో అంటకాగారు దేవేందర్‌గౌడ్‌. 2009 ఎన్నికల్లో పిఆర్‌పి ఎంతమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. 18మంది ఎమ్మెల్యేలను గెలుచుకోవటమే ఆ పార్టీకి గగనమైంది. ఆ పార్టీని నము్మకున్నందుకు దేవేందర్‌కూ పరాభవం తప్పలేదు.
చివరకు తెలుగుదేశం నుంచి బయటకు రావాలన్న తన నిర్ణయం ఎంత నష్టాన్ని కలిగించిందన్న ఆలోచనలో పడ్డారు. ఏం చేయాలో తోచని అయోమయంలో దేవేందర్‌ గౌడ్‌ ఉన్నారు. మాతృసంస్థకు తిరిగి వెళ్లటం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. పాతకాపులు వస్తే వారిని సాదరంగా ఆహ్వానించటానికి తెలుగుదేశం, కాంగ్రెస్‌లు సిద్ధంగానే ఉన్నాయి. కానీ, తెలుగుదేశంలో తిరిగి చేరితే, దేవేందర్‌కు పూర్వవైభవం దక్కుతుందా అన్నదే అనుమానం. పార్టీలో ఒక వెలుగు వెలిగి అన్ని విధాన నిర్ణయాల్లో ముఖ్యపాత్ర నిర్వహించిన దేవేందర్‌గౌడ్‌ అదే పార్టీలో రెండోశ్రేణి నాయకుడుగా మనుగడ సాగించగలరా? అప్పటి గౌరవ మర్యాదలు ఆయనకు పార్టీ కేడర్‌ నుంచి మళ్లీ దక్కుతాయా? కాలమే నిర్ణయించాలి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి