23, జులై 2009, గురువారం

ఈ మోకరిల్లడం ఇంకెన్నాళ్ళు?

తెల్లవాడు మనల్ని వదిలి వెళ్లినా స్వతంత్రంగా బతికే అలవాటు మాత్రం మనకు అరవై ఏళ్లయినా రాలేదు. ఎప్పుడో వాడున్నప్పుడు వాడు చేసిన చట్టాలను కొత్త పుస్తకంలో తిరగరాసుకుని అమలు చేసుకోవటమే తప్ప, మన కోసం మన వాళు్ల బుర్ర పెట్టి ఆలోచించింది లేదు. 1935 నాటి పోలీసు చట్టాన్ని మనం కళు్ల మూసుకుని అమలు చేసుకుంటున్నాం. పోలీసు సంస్కరణలు అంటే అబ్బో.. అని మన వాళు్ల ఆమడ దూరం పారిపోతారు. అప్పుడు యూరోప్‌ వాడు మన నెత్తిన కూచుంటే, ఇప్పుడు అమెరికా వోడు మన పాలిటి శాపంగా మారాడు. మొన్నటికి మొన్న అణు ఒప్పందం పేరుతో మన అణు కేంద్రాలను తనిఖీ చేసేందుకు సింగ్‌జీ ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఆయుధాల కొనుగోలు వ్యవహారంలో వినియోగదారుల నియంత్రణ ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్‌ కొనుగోలు చేసిన రక్షణ పరికరాలను తనిఖీ చేసే అధికారం అమెరికాకు కట్టబెట్టేశారు.. ఇదేమని అడిగితే అబ్బే అదేం లేదు.. మన సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టనే లేదని విదేశాంగ మంత్రి భుజాలు తడుముకున్నారు.

నిజానికి వైట్‌ హౌస్‌లో చిన్న శబ్దమైతే చాలు.. న్యూఢిల్లీలోని 7 రేస్‌ కోర్‌‌స రోడ్డు ఉలిక్కిపడుతుంది. మన పాలకులపై అమెరికా లాబీ ఎంత బలంగా పనిచేస్తుందో చెప్పేందుకు మాటలు చాలవు. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. బిజెపి, కాంగ్రెస్‌, లెఫ్‌‌టలన్న తేడా లేదు. ప్రాంతీయ పార్టీలకైతే అమెరికా పాలకులు ధర్మప్రభువుల్లాంటి వాళు్ల. అన్ని రాజకీయ పార్టీలూ ఒకే తాను ముక్కలు. అధికారంలో లేకపోతే అమెరికాపై నిందలు.. ఉన్నప్పుడు ప్రపంచ పోలీసుకు జీహుజూర్‌ అనటం... దేశం గురించి, దేశ భద్రత గురించి పోచికోలు కబుర్లు చెప్పమంటే ఎనై్ననా చెప్తారు. గంటల తరబడి మైకులు వదలరు. చేతల్లోకొచ్చేసరికే జావగారిపోతారు. 1991లో ఆర్థిక సంస్కరణల సమయంలో ప్రారంభమైన ఈ ధోరణి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ హయాంలో ఎక్కువైంది. అమెరికాతో మిత్రత్వానికి తెగ తాపత్రయ పడ్డారు. 2001 సెప్టెంబర్‌ 11న న్యూయార్‌‌క ట్విన్‌ టవర్‌‌సపై అల్‌ఖైదా దాడి తరువాత ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా నిర్వహించిన యుద్ధానికి కోరకుండానే సాయపడేందుకు అటల్‌బిహారీ వాజపేయి సర్కారు సిద్ధపడింది. బుష్‌ దొరకు పాకిస్తాన్‌ అంటే తెగ ముద్దొచ్చేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో తమ మిత్రపక్షాల్లో మొదటిస్థానం పాకిస్తాన్‌ అంటూ మహా ఆనందంగా చెప్పుకొచ్చారు. అదే బుష్‌ మన్మోహన్‌జీకి రెడ్‌కార్పెట్‌ పరచి మరీ వైట్‌హౌస్‌లో విందిచ్చారు. భారత్‌ను అణు శక్తి దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించేశారు. బుష్‌ తనను ఉచ్చులో బిగిస్తున్నట్లు మన్మోహన్‌ ఆరోజు ఊహించలేదు. ఇప్పటికీ అర్థం కావటం లేదు. దీనికి తోడు అమెరికా స్వచ్ఛమైన ఉద్దేశంతోనే మనకు సాయం చేయటం కోసమే అంతా చేస్తోందని భారత్‌లోని అమెరికా వందిమాగధ బృందం తెగ ప్రచారం చేసేసింది. ఇంకేముందు అమెరికాతో అణు ఒప్పందం కుదిరిపోయింది. పౌర ప్రయోజన అణు కార్యక్రమానికి ఇంధన సరఫరాకు సంతకాలు జరిగిపోయాయి. దాంతో పాటే మన అణు రియాక్టర్లను తనిఖీ చేసే అధికారమూ కట్టబెట్టారు. ఇదేమని అడిగితే.. అబ్బే ఆందోళన చెందాల్సింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు అమెరికాతో ఏ రక్షణ పరికరాన్ని కొన్నా, దాని వినియోగం ఎలా చేస్తున్నారన్నది తనిఖీ చేసే అధికారాన్ని అంకుల్‌శామ్‌కు అప్పజెప్పేశారు. ఒక వస్తువును మనం కొన్నప్పుడు ఆ వ్యాపారి వచ్చి దాన్ని ఎలా వాడుతున్నారో చూస్తానంటే ఎలా ఉంటుంది? అమెరికా వాడు మనకు ఆయుధాలు ఉచితంగా ఏం కట్టబెట్టట్లేదు. మనం కోట్ల రూపాయల డబ్బులు కుమ్మరించి కొనుక్కుంటున్నాం. అలాంటప్పుడు వాళు్ల మనల్ని తనిఖీ చేయటం ఏమిటి? వాళ్ల దగ్గర కొన్న ఆయుధాలనే తనిఖీ చేస్తారా? మిగతా దేశాల దగ్గర నుంచి తెచ్చుకున్నవీ తనిఖీ చేస్తారా? యుపిఎ ప్రభుత్వం అందుకు ఎలా ఒప్పుకుంది. ఇప్పటికే మన మీద అమెరికా పెత్తనం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ఇది ఇంకా పెరిగితే, మనపై ఒత్తిడి పెరుగుతుంది. చుట్టూ శత్రుమూకలు కము్మకుని పద్మవూ్యహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా మనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఈ పరిస్థితిలో అమెరికా చెప్పిన దానికల్లా తలాడిస్తూ పోవటం, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాలను ప్రపంచ పోలీసు చేతిలో పెట్టడం ఎంతవరకు సమంజసం? నిజంగా మన పరిపాలకుల బురల్రో ఉన్నదేమిటి? అమెరికా అగ్రరాజ్యం కాబటిట ఆ దేశంతో మంచి సంబంధాలు పెంచుకోవటం తప్పుకాదు.. అవసరం కూడా. అంతమాత్రం చేత దానికి దాసోహం అనే పరిస్థితి ఉంటే అది జాతి అస్తిత్వాన్ని పణంగా పెట్టినట్లే.... సింగ్‌జీ ఈ విషయాన్ని గుర్తించకపోతే.. అమెరికా మన దేశాన్ని తన సైనిక స్థావరంగా మలచుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

కామెంట్‌లు లేవు: