నన్ను ఉరితీయండి.. అజ్మల్ అమీర్ కసబ్ న్యాయమూర్తిని వేడుకున్నాడట..ముంబయి దాడుల వ్యవహారంలో తన పాత్ర పరిమితమంటూ తెలివిగా కోర్టులో చెప్పుకొచ్చాడు. తాను ఎవరిపైనా కాల్పులు జరపలేదని, తన సహచరుడు అబు ఇస్మాయిల్‌కు సహాయం చేయటంతోనే తన బాధ్యత తీరిపోయిందని కసబ్ చెప్పాడు. కరాచీ నుంచి ముంబయికి చేరుకుని, అక్కడ దాడులు నిర్వహించిన అన్ని సందర్భాల్లోనూ తన పాత్ర కేవలం కాపలాకే పరిమితమని కథ చెప్పేశాడు.
ఎంవి కుబేర్ పడవలో నావికుడు అమర్ సింహ్ సోలంకీని హత్య చేసినప్పుడు కానీ, ఆ తరువాత కామా ఆసుపత్రి వద్ద పోలీసులను చంపటంలో కానీ తాను అసలు తుపాకీ వాడనే లేదన్నట్లుగా స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు.. డిఫెన్‌స లాయర్ వాదనను సైతం తోసిరాజని మరీ నేరాంగీకార ప్రకటన చేసేశాడు. మన దేశంలో నేరాలకు శిక్ష పడటం, ఒకవేళ శిక్ష పడినా అది అమలు కావటం అన్నది మామూలుగానే అరుదుగా జరుగుతుంది. ఇక తాను నేరం చేశానంటూనే.. అది చాలా చిన్నదని చూపించే ప్రయత్నం చేయటంతో ఇక ఏ కోర్టయినా ఇంకేం శిక్ష విధిస్తుంది? దాడుల్లో అతని పాత్ర తక్కువ అని భావిస్తే ప్రపంచంలో ఏ కోర్టు కూడా కసబ్‌కు ఉరిశిక్ష విధించే అవకాశం ఉండదు. పైగా భారత న్యాయస్థానాల్లో అలాంటిది సాధ్యం కాదు. ఇవన్నీ తెలుసుకున్నాడు కనుకే కసబ్ తెలివిగా పావులు కదిపాడు. ముంబయి ప్రత్యేక న్యాయస్థానం ఇతని నేరాంగీకార ప్రకటనను ఆంగీకరించేలా చేశాడు. తనను, పాకిస్తాన్‌లోని తన వారిని రక్షించేందుకు అద్భుతమైన నాటకం ఆడాడు. తనకు సహకరించటం లేదంటూ కసబ్ డిఫెన్‌స లాయరేమో.. కేసునుంచి విత్‌డ్రా చేసుకుంటానని అంటున్నాడు. కసబ్ నేరాంగీకార ప్రకటనను కోర్టు ఆమోదించినట్లయితే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్జ్వల్ నికమ్ సందేహం వ్యక్తం చేసినట్లు రైల్వే స్టేషన్‌లో కాల్పులు జరపటం, స్కోడా కారును ఎత్తుకెళ్లటం వంటి వాటికే శిక్ష పడుతుంది. వాస్తవానికి కసబ్ కోర్టులో పేర్కొన్న అంశాలు చాలా తక్కువ. అన్ని విషయాలను కసబ్ చెప్పనే లేదు. అవన్నీ వెలుగులోకి రావలసి ఉంది. అంతకు మించి ఇతర సాక్ష్యాలను దర్యాప్తు బృందం కసబ్‌కు వ్యతిరేకంగా సేకరించినవి ఉన్నాయి. వాటినీ కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఓ పక్క విచారణ కొనసాగుతూనే ఉన్నప్పటికీ, ఈ వాఙ్మూలం ఆధారం చేసుకుని సర్కారు పాకిస్తాన్‌పై ఏ విధంగా ఒత్తిడి పెంచేదీ చూడాలి. లఖ్వీని ఎలా విడుదల చేశారో పాక్ సర్కారును నిలదీసే ధైర్యం ప్రభుత్వానికి వస్తుందనైతే ఊహించలేం. కనీసం కసబ్ లాంటి ముష్కరుల పీచమణచే విషయంలోనైనా కఠినంగా వ్యవహరిస్తుందా అంటే అదీ అనుమానమే. ఎందుకంటే పార్లమెంటుపై దాడికి కుట్రపన్నిన అఫ్జల్ గురుకు ఉరి తీయటానికి మత పరమైన ఓట్లు గుర్తొచ్చి అతిథి మర్యాదలు చేస్తున్న ప్రభుత్వానికి అజ్మల్ అమీర్ కసబ్‌పై కరుణ కలుగకుండా ఉండదని ఎలా అనుకోగలం?
1 కామెంట్:
మంచి విశ్లేషణ. మన చట్టాలను మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ మార్పు సాధ్యమౌతుందో ? లేదో ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి