4, జులై 2009, శనివారం

సంస్కరణలా? సమర్పణలా?

ప్రణబ్‌ ముఖర్జీ బడ్జెట్‌ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం చేతుల్లోనుంచి ప్రైవేటు చేతుల్లో పెట్టబోతోందా? పార్లమెంటులో ప్రణబ్‌ ముఖర్జీ ప్రవేశపెట్టిన తాజా ఆర్థిక సర్వే ఈ అనుమానాలనే బలపరుస్తోంది. రక్షణ రంగంతో సహా పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సర్వేలోని అనేక అంశాలు చెప్పకనే చెప్తున్నాయి. అదే జరిగితే దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థను ఏ దిశలో ముందుకు తీసుకువెళ్లనుంది?
సబ్సిడీల తొలగింపు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు విస్తారంగా తలుపులు తెరవటం, పలు కీలక రంగాల్లో ప్రయివేటీకరణకు ప్రోత్సాహాల్ని కల్పించటం......... కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే చేసిన సిఫార్సుల్లో కీలకమైనవి ఇవి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించే అవకాశం ఉంది. బడ్జెట్‌లో లక్షకోట్లకు పైగా అత్యధిక నిధుల కేటాయింపు జరిగే రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలని సర్వే నిష్కర్షగా చెప్పింది. దాదాపు 49 శాతం ఫారిన్‌ ఇన్వెస్‌‌టమెంట్‌కు అనుమతించాలని సిఫార్సులు ఉంటున్నాయి. రక్షణ రంగంలో ప్రయివేటు పాత్ర ఎలా ఉండాలనే విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటన్నది తెలియదు. ఓ పక్క పొరుగు దేశాలతో నిరంతరం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రక్షణ రంగంలో ప్రయివేటు పాత్ర ఎంతవరకు సమంజసం అన్నది నిపుణులే చెప్పాలి. వాస్తవానికి బడ్జెట్‌ కేటాయింపుల్లో లక్ష కోట్లకు పైగా రక్షణ రంగానికే వెళు్తన్నాయి. ఇంత ఖర్చును తగ్గించుకోవటం కోసమే సర్వేలో ఈ ప్రతిపాదన చేసినట్లు స్పష్టంగానే అర్థమవుతోంది. రక్షణ రంగం విషయంలో డబ్బులు, కేటాయింపులు, జమా ఖర్చుల గురించి ఆలోచిస్తూ పోతే.. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి రావచ్చు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు తెగించి ప్రధానశత్రువు పీచమణచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తే, కాశ్మీర్‌ సమస్యను పరిష్కరిస్తే, సైన్యం అవసరాలు సహజంగానే తగ్గిపోతాయి. ఈ దిశగా కృషి చేయకుండా, ఆలోచించకుండా, వూ్యహరచన చేయకుండా, గుడ్డిగా విదేశీ పెట్టుబడులను డిఫెన్‌‌స ఫీల్‌‌డలోకి ఆహ్వానించటం ఎంతవరకు సబబు?
అటు బీమా రంగంలోనూ ప్రైవేటు పాత్రను కీలకం చేయాలని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే బీమాలోకి అనేక ప్రయివేటు సంస్థలు ప్రవేశించాయి. విదేశీ సంస్థలు కూడా భారత ఇన్సూ్యరెన్‌‌స మార్కెట్‌లోకి ప్రవేశించాయి. ఇక ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసి, జిఐసి వంటి సంస్థల్లోనూ ప్రయివేటు పెట్టుబడులకు ఆస్కారమిస్తే దేశంలో ఇప్పటివరకు వాటికి ఉన్న గుత్తాధిపత్యానికి తెరపడుతుంది. అది సామాన్య ప్రజానీకానికి మేలు చేసే మాటెలా ఉన్నా, ప్రభుత్వం వాటాలను ఉపసంహరించుకుంటే ఆర్థిక భారం నుంచి తప్పించుకుంటుంది. ప్రభుత్వానికి కావలసింది ఇదేనేమో... ఇంకోపక్క రిటైల్‌ రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించాలని డిమాండ్‌ విస్తృతమవుతుంటే, ఆర్థిక సర్వే మాత్రం ఈ రంగంలో విదేశీయులకు రాచబాట వేయాలని సూచిస్తోంది. రిలయన్‌‌స, హెరిటేజ్‌, ఫుడ్‌బజార్‌ వంటి వాటితో చిల్లర కిరాణా వ్యాపారం దారుణంగా దెబ్బతింది. కులవృత్తులు పోయినట్లే... చిల్లర వ్యాపారమూ క్రమంగా కనుమరుగవుతోంది. అదే జరిగితే చిన్న వ్యాపారులంతా రోడ్డున పడతారు. మరి వారికి ఉపాధి కల్పించేదెవరు?
అన్నింటికీ మించి ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్నాలను పక్కన పెట్టి మిగతా అన్ని సంస్థల్లోనూ తక్కువలో తక్కువ పది శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోవటానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. చివరకు బొగ్గు, ఇంధనంపైనా ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని తగ్గించే ఆలోచన చేస్తున్నది. అణు ఇంధన విషయంలోఇ ప్పటికే రిమోట్‌ కంట్రోల్‌ అమెరికా చేతుల్లోకి ఇప్పటికే వెళ్లిపోయింది. ఇంకా ప్రైవేటు చేస్తే... మన దేశ భద్రత మేడిపండు చందంగా మారవచ్చు. ఈ విషయంలో ప్రణబ్‌ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. దేశంలో ప్రత్యేకతను సంతరించుకుని స్వయంగా లాభాలను ఆర్జిస్తున్న రైల్వేల్లోనూ ప్రైవేటు చేతులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరిన్ని ఎఫ్‌డిఐలను ఆహ్వానిస్తామని మమత తన బడ్జెట్‌ ప్రసంగంలో విస్పష్టంగా పేర్కొన్నారు. అదే జరిగితే ప్రజాప్రయోజనాలకు ప్రాధాన్యం తగ్గి వ్యాపార ధోరణి ప్రబలిపోతుంది.
ఏ ఆర్థిక వ్యవస్థకైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఊతాన్నిచ్చేవే. ఇందులో ఎవరికీ సందేహం అక్కర్లేదు. ఆక్షేపణలూ ఉండక్కర్లేదు. కానీ ఆ ఎఫ్‌డిఐలు మనకు మేలు చేసేవిగా ఉండాలి కానీ, మనల్ని, మన ఆధిపత్యాన్ని కబళించేలా ఉండకూడదు. మన నియంత్రణలో విదేశీ సంస్థలు ఉండాలి కానీ, వాటి నియంత్రణలోకి మనం వెళ్లకూడదు. వివిధ విభాగాల్లో ఎఫ్‌డిఐలను ఆహ్వానించే ముందు ప్రణబ్‌ దా... ఈ అంశాన్ని గుర్తుంచుకుంటే చాలు..

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఓ పదేళ్ళ క్రితం అనుకుంటా..ఓ వ్యాసం చదివాను.
అందులోని సారాశం ఇది:
ప్రపంచం అంతా మాల్స్‌కి వెళ్తున్న సమయంలో ఇండీయాలో రిటైల్ షాపులు చిన్ని చిన్నివౌతూ పోయినాయిట. దానికి కారణం - భారతీయుల్లో ఉన్న ఎంటర్‌ప్రెన్యూరియల్ స్పిరిట్టే నన్నాడు చివరికి వ్యాస కర్త. చైతన్యమొకటే కాదు - అసలు వేరే ఉపాధి అవకాశాలు కూడా ఏవి పెద్దగా ఉండేవి కావుగా!

మన విధానల వల్ల, మనం భారతీయుల్లోని ఆ చైతన్యాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాము. కావాల్సిన ఆలోచనలూ అందించలేకపోయాము. క్యాపిటలూ అందించలేకపోయామూ. ఇప్పుడేమో, రిటైలింగ్‌లో విదేశీ పెట్టుబడి వచ్చేస్తే ఎలా అనేది సమస్య. నిజంగానే, ఈ చిన్నవ్యాపారులందరికీ ఏ విధమైన ఎంప్లాయిమెంటుని ఇవ్వగలం!? వాళ్ళెలా ఈ మార్పుకి ఎడ్జస్టవ్వబోతున్నారో, నాకు అంతుచిక్కటం లేదు.

ఒక ఆశేంటంటే, ఈ రిటైలింగ్‌లో దిగుతున్న వాళ్ళ ఫ్రాంచైంగ్ మోడల్లోనే, మనకి కాస్త వేరే విధమైన రూపాలు బయటికి తెస్తారేమో అని. అది మార్కెట్‌ రియాలిటీ వల్ల వస్తుంది కాబట్టి. అందులో కొందరన్న ఈ కొత్తమోడల్సులోకి వెళ్ళొచ్చు. అంటే ఈ ఫ్రాంచైంగ్ పెట్టుబడి విధానల్లోకూడా తేడాలు. మరి వాటికి బ్యాంకు రుణాలు/ ఇతర పెట్టుబడి సాధానల విషయాల్లో కూడా మార్పులు రావాలన్న మాట. ఐనా ఇప్పుడూ రిటైలింగ్ కుదేలైందిట కాబాట్టి...చూడాలి.

ఇప్పుడేమో ఐటి కూడా పడిపోయింది. లేకపోతే, పైకొచ్చిన పిల్లలున్న కుటుంబాల్లో, ఆ పిల్లలు సైడ్లో ఈ ఫ్రైంఛింగ్‌లో ఇన్వెస్టుచేసినా, మిగిలినా కుటుంబ సభ్యుల్లోని పిల్లలు దాని యాజమాన్యం చూసుకుంటున్నా - సంక్రాంతి సినిమాలాగా ఇళ్ళు సాగిపోతాయేమో అనుకునేవాణ్ణి. ఆ మధ్య అందరూ పడి రియల్ ఎస్టేటులోనూ/ స్టాకు మార్కెట్టులో మాత్రమే పెట్టుబడి పెట్టారు.

మీరు అన్నీ రాసారు. నా మనసెందుకో రిటైలింగ్ దగ్గర ఆగిపోయింది లెండి.

మీరు ఇలాంటివి ప్రొఫెషనల్‌గా రాస్తారేమో? ఇలా ఎందుకు ఉత్తగా వేస్టుచేసుకోగలుతున్నారో...నాకు కొంచెం ఆశ్చర్యంగానూ, ఆసక్తిగానూ ఉంది. తెలుసుకోవచ్చునా?

Praveen Mandangi చెప్పారు...

ఈ లింక్ చదవండి: http://vasavya.blogspot.com/2009/07/blog-post_09.html